రగులుతున్న కొల్లేరు
పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్ర
అందరికీ చట్టాలు ఒకేలా ఉండాలి
● పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్రకు శ్రీకారం
● కొల్లేరులో చెరువుల సాగుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్
కై కలూరు: కొల్లేరు ప్రజలు రగిలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి నివేదిక అందించాలని కొల్లేరు గ్రామాల్లో అవగాహనల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొల్లేరు ప్రజల్లో అలజడి రేగింది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోడానికి ప్రజలు సిద్దమవుతోన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్రం సాధికారిత కమిటీ(సీఈసీ) కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల లెక్కలు పక్కాగా అందించాలని కొరడా ఝులిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు మినీ కొల్లేరు ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు.
పలు మండలాల్లో ఆక్రమ చెరువులను ధ్వంసం చేసే క్రమంలో రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్‌ఎన్.మూర్తి, డీఎఫ్‌ఓ బి.విజయ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొల్లేరు గ్రామాల్లో ప్రజలకు అక్రమ చెరువులను ఖాళీ చేయాలని అవగాహన కలిగిస్తున్నారు. కొల్లేరు ప్రజలు సైతం మా ప్రాణాలైన వదులుతాం.. చెరువుల్లో సాగు వదలం.. మాకు జీవనోపాధి ఇదే అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తోన్నారు. కై కలూరు మండలం చటాకాయి, వడ్లకూటితిప్ప గ్రామాలకు వెళ్ళి వచ్చిన ఫారెస్టు అధికారులు, బుధవారం కొల్లేటికోటలో అమ్మవారి దేవస్థానం వెనుక 60 ఎకరాల అక్రమ చెరువు పరిశీలనకు వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.
ఉప ముఖ్యమంత్రి, అటవీ మంత్రి పవన్ కల్యాణ్‌కు కొల్లేరు ప్రజలు సమస్యలు వివరించి, చెరువుల ధ్వంసాన్ని అడ్డుకోడానికి ఈ నెల 27, 28 తేదీలలో సుమారు 25,000 మందితో మంగళగిరిలో ఆయన కార్యాలయం వరకు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తుదీ తేదీల ప్రకటనకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే వడ్డీ సాధికారిత రాష్ట్ర చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల్లో పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర నిర్వహణ నిమిత్తం గురువారం వస్తున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు సమస్యను తీసుకువెళ్ళి, కొల్లేరు పెద్దలందరూ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
చట్టం అంటే అందరికీ సమానంగా పనిచేయాలి. సంక్రాంతి పండగ రోజుల్లో సుప్రీంకోర్టు కోడిపందేలు వద్దని చెబుతున్నా మూడు రోజులు జరుగుతున్నాయి. కొల్లేరు ప్రజలు చేపల చెరువులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని ధ్వంసం చేస్తే ఎలా? కొల్లేరు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సమస్యను పవన్‌కల్యాణ్‌కు తెలియచేయడానికి పాదయాత్ర నిర్వహిస్తాం.
–బలే ఏసురాజు, వడ్డీ సాధికారత రాష్ట్ర చైర్మన్, కొట్టాడ, కై కలూరు మండలం


