పులి సంచారంతో భయం భయం
పులిని చూశా
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే రహదారి మధ్యలో పెద్దపులి సంచారంతో గిరిజన ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సరిహద్దు గ్రామం కావిడిగూడెంలో పులి దాడి చేసి ఆవును చంపడంతోపాటు ఒక లేగదూడను చాలా దూరం వరకూ ఈడ్చుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. అనుకున్నట్టుగానే బుధవారం రాత్రి పొలం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు అనే ఒక రైతుపై అంతర్వేదిగూడెం సమీపంలో పులి దాడి చేసే ప్రయత్నం చేసిందని గ్రామస్తులు తెలిపారు. దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజు గ్రామస్తులను కలవగా అతనికి ధైర్యం చెప్పి అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి భక్తులు ద్విచక్ర వాహనాలపై, కాలినడకన వెళ్తుంటారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో మొక్కజొన్న పంటల్లో, వర్జీనియా పొగాకు, పనుల్లో కూడా కూలీలు పొలాలకు వెళ్తున్నారు. మరోపక్క కొండప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో శుభ్రం చేసే పనులు, మందు వేసే పనుల్లో కూడా కూలీలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. బుధవారం పెద్దపులి గిరిజనుడికి కనిపించి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండవైపుకు వెళ్ళినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని కనిపెట్టి సురక్షితంగా అడవిలో వదిలేలా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పిల్లలను ఒంటరిగా వదలొద్దని, పొలాలకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
గత ఏడాదీ ఇదే పరిస్థితి
గత ఏడాది కూడా ఇదే రోజుల్లో పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లో పులి సంచారంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. పాపికొండల అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి ద్వారకా తిరుమల, గోపాలపురం, బుట్టాయగూడెం మండలాల్లో సంచరించి పాడిపశువులపై దాడి చేసింది. ద్వారకా తిరుమల కొవ్వాడ, ఉడతపల్లి గ్రామాల్లో కూడా పులి సంచరించి భయబ్రాంతులకు గురి చేసి అనంతరం మళ్లీ పాపికొండల అభయారణ్యం వైపు వెళ్ళిపోయింది. ఈ ఏడాది పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఆవులపై దాడి చేసిన పులి గ్రామాల్లో ఎవరిపై దాడి చేస్తుందో అనే భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
అంతర్వేదిగూడెం సమీపంలో రైతుపై దాడికి ప్రయత్నించిన పులి
తాటి కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కాను. కిందకు తొంగి చూడగా పులి కనిపించింది. దగ్గరగా వచ్చేసరికి కేకలు పెట్టాను. ఒక్కసారిగా గాండ్రించుకుంటూ గ్రామ సమీపంలోని కొండవైపు వెళ్ళింది. పులిని చూసిన నేను భయాందోళన చెందాను. మా సోదరుడు కూడా పులిని చూశాడు.
– బొల్లి రవీంద్రరెడ్డి, పందిరిమామిడిగూడెం, బుట్టాయగూడెం మండలం
పులి సంచారంతో భయం భయం


