దాడి ఘటనలో మరో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: స్థానిక దళిత పేటలో ఆస్తి తగాదాల నేపధ్యంలో మంగళవారం రాత్రి నలుగురు మహిళలపై దాడి ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు. మంగళవారం రాత్రి జీలుగులమ్మ మృతి చెందగా.. బుధవారం ఆమె తల్లి చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. జీలుగులమ్మ కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణి ఏరియా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. బుధవారం ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ధనలక్ష్మి, ఉషారాణిని పరామర్శించి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు ఘటనా స్థలంలో వేలి ముద్రలు, రక్తనమూనాలు, ఘటనకు సంబంధించి ఇతర ఆధారాలు సేకరించారు. ఏఎస్పీ, డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. ముప్పిడి వివేక్, ముప్పిడి పవన్, ముప్పిడి రవికుమార్, ముప్పిడి నాగేశ్వరి, కొత్తూరు శ్యామ్‌లు జీలుగులమ్మ కుటుంబంపై మంగళవారం రాత్రి గొడ్డలి, కర్రలతో దాడి చేశారన్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రాత్రి సమయంలో జీలుగులమ్మ ఇంటికి వెళ్లే దారిలో ముప్పిడి నాగేశ్వరి మంత్రించిన నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు వేసి.. మళ్లీ వారే 112కు కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఇరువర్గాలను పిలిచి సర్ధిచెప్పి ఇంటికి పంపించేశారు. పొద్దుపోయాక వివేక్, పవన్, రవికుమార్, నాగేశ్వరి, కొత్తూరి శ్యామ్ వీరంతా జీలుగులమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేశారు. వివేక్ గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయగా, జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి చుక్కమ్మ, జీలుగులమ్మ కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా, ధనలక్ష్మి, ఉషారాణి కోలుకున్నట్లు తెలిపారు. ఘటనపై జీలుగులమ్మ కూతురు ఉషారాణి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
దాడి ఘటనలో మరో మహిళ మృతి


