డయాలసిస్ రోగులకు ఇబ్బందులు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చిన రోగులు మంగళవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలోని టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆదివారం ఉరి వేసుకుని మృతిచెందిన నేపథ్యంలో సోమవారం అపోలో డయాలసిస్ సెంటర్‌లో సేవలు నిలిచిపోయాయి. అయితే డయాలసిస్ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం 6గంటల షిఫ్ట్ కేటాయించిన రోగులు ఆసుపత్రికి చేరుకున్నారు. తీరా వారు డయాలసిస్ కేంద్రానికి వచ్చి చూసేసరికి కేంద్రానికి తాళం వేసి ఉంది. దీంతో రోగులు, వారితో వచ్చిన వారు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. సుమారు 4 గంటల పాటు వేచిన తరువాత ఉదయం 10.30 గంటలకు అపోలో సిబ్బంది డయాలసిస్ కేంద్రం తెరిచి రోగులకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా రోగులకు, అపోలో సిబ్బందికి వాగ్వివాదం జరిగింది. డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్ మృతికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని సిబ్బందిని రోగులు, వారి సహాయకులు ప్రశ్నించారు. దీనిపై అపోలో రీజనల్ ఆపరేషన్స్ మేనేజర్ వి.మధుకిరణ్ మాట్లాడుతూ మృతి చెందిన సుధాకర్ తమ సంస్థలో ఎనిమిదేళ్లుగా నమ్మకంగా పని చేశారన్నారు. సుధాకర్ మృతికి కారకులైన ఇద్దరు పేషెంట్లకు అపోలో డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయబోమని తెలిపారు. దీంతో రోగులు, సహాయకులు ఆందోళన విరమించారు. అనంతరం రోగులకు డయాలసిస్ చేశారు.


