రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా
● కూటమి పార్టీలు కలిసికట్టుగా దోపిడీ
● సంవత్సరంకాలంలో కోట్లకు పైనే స్వాహా
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలంలో రెండో పెద్ద గ్రామంగా ఉన్న రాజవరం నేడు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్లుగా జూద క్రీడలకు, అక్రమ రవాణాకు కేంద్రంగా నిలిచింది. రాజవరం పంచాయతీ పరిధిలో మంగపతిదేవిపాలెం, గంగవరం గ్రామాలున్నాయి. గతంలో అడపాదడపా గ్రావెల్, ఇసుక, కలప రవాణాలు సాగినప్పటికీ గత సంవత్సరం నుంచి పంచాయతీ పరిధిలో రెవిన్యూ భూములలోని గ్రావెల్, సాగు చెరువులలో మట్టి, అటవీ ప్రాంతంలోని కలప అక్రమంగా రవాణ చేస్తున్నారు. తాజాగా భూ దందాలు, వైట్ కాలర్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. నాటు సారా తయారీ, పేకాట, కోతాట, వన్యప్రాణుల వేటకి నిలయంగా మార్చారు. రేషన్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ వంటి నేరాలకు అంతే లేకుండా పోయిందని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీలన్నీ ఐక్యమత్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కి పంచాయతీ పరిధిలోని గ్రామాలు 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఆక్రమార్కులకు కలిసి వచ్చింది. పోలీసులు వెళ్లేసరికే ఫలితం లేకుండా పోతుంది.
పోలవరం నియోజకవర్గంలోని అత్యంత సమస్యాత్మకమైన గ్రామంగా రాజవరానికి పేరుంది. కొందరు వ్యక్తులు సమయానుకూలంగా అధికార పార్టీలోకి మారుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రచారం సాగుతోంది. పంచాయతీ పరిధిలో మద్యం మాఫియా, గంజాయి రవాణాకు, కోడిపందాల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగమే ఉంది. ఈ అక్రమార్కుల భరతం పట్టే పాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు బాస్ ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
నాటు సారా కోసం బెల్లపు ఊట
రాజవరంలో విక్రయిస్తున్న గంజాయి
అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్
రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా
రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా
రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా
రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా


