ఎట్టకేలకు విరాళాల నగదు అప్పగింత
ఆగిరిపల్లి: గత 20 ఏళ్లుగా శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల నుంచి అన్నదానం పేరుతో వసూలు చేసిన రూ. 28.50 లక్షల నగదును ఎట్టకేలకు మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో అన్నదాన కమిటీ సభ్యులు మంత్రికి అందజేశారు. ఈ నెల 19న ‘అన్నదానం.. స్వాహా పర్వం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. సాక్షిలో వెలువడిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి పార్థసారథి రథసప్తమి తిరునాళ్లలో జరిగే అన్నదానం నిర్వహణపై గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల నుంచి విరాళాల ద్వారా సేకరించిన వాటిలో మిగిలిన రూ.28.50 లక్షలను మంత్రికి అందజేశారు. దీనిలో నగదు రూ.15.50 లక్షలు, చెక్ ద్వారా రూ. 13 లక్షలు అందజేశారు. మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రూ.28.50 లక్షలను దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తామని అన్నారు. ఈ సంవత్సరం నుంచి రథసప్తమి రోజు నిర్వహించే అన్నదానానికి భక్తులు అందజేసే విరాళాలకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, అంతేకాకుండా భక్తుల నుంచి వచ్చిన విరాళాలు దేవస్థానం ఖాతాలోనే వేయాలని ఆదేశించారు. అన్నదాన కమిటీకి గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఎట్టకేలకు విరాళాల నగదు అప్పగింత


