అప్పలరాజుపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి
జంగారెడ్డిగూడెం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం బనాయించిన పీడీ యాక్టు, అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని, బేషరతుగా విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) ఆలిండియా జాయింట్ సెక్రటరీ బి.భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే జీలుగుమిల్లి మండలం వంకావారి గూడెంలో పెడుతున్న ఇండియన్ నేవీ, అణ్వాయుధాల ఫ్యాక్టరీ నిర్మాణానికి భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు టీ.ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్రకోశాధికారి వి.చిట్టిబాబు పాల్గొన్నారు.


