ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
కబడ్డీ చాంపియన్లుగా రైల్వే నాగ్‌పూర్, ఢిల్లీ జట్లు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో సౌత్ ఈస్ట్ రైల్వే నాగ్‌పూర్ జట్టు, మహిళల విభాగంలో సీఆర్‌పీఎఫ్ ఢిల్లీ జట్టు చాంపియన్ షిప్ సాధించాయి. మహిళల విభాగంలో గత ఏడాది కూడా సీఆర్‌పీఎఫ్ ఢిల్లీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈ ఏదాది కూడా మహిళల విభాగంలో ఢిల్లీ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకున్నట్టు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో రన్నరప్‌గా ఎస్‌డీ స్పోర్ట్స్ క్లబ్ హర్యానా జట్టు నిలిచింది. 3, 4 స్థానాల్లో సీఆర్‌ఎఫ్ ఢిల్లీ, బాబా హరిదాస్ హర్యానా జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో హిమాచల్‌ప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచి రెండవ స్థానం దక్కించుకోగా హర్యానా, బాబాహరిదాస్ హర్యానా జట్లు 3, 4 స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తానికి ఇరు విభాగాల్లోను హర్యానా జట్లు ఆధిపత్యాన్ని చూపించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో జిల్లా ఎస్పీ నయాం అస్మి చేతుల మీదుగా విజేతలకు బహుబతులు అందించారు. పురుషుల, మహిళల విభాగాల్లో మొదటి బహుమతి రూ 1.50 లక్షలు, రెండవ బహుమతి రూ 1 లక్ష, మూడవ బహుమతి రూ 75 వేలు, నాల్గవ బహుమతి రూ 50వేలు నగదు, షీల్డ్స్ అందించారు. విజేత జట్లకు మొత్తం రూ 7.50 లక్షలు నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయాం అస్మి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు సంస్కృతిలో భాగమన్నారు. యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మారుమూల పట్టణంలో 30 ఏళ్ల నుంచి జాతీయస్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినంధనీయమన్నారు. మాజీమంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం ఆర్డీవో దాసి రాజు, గుగ్గిలపు మురళి, వన్నెంరెడ్డి శ్రీనివాస్, అధికారి ఏసు, బళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళల విభాగంలో చాంపియన్‌షిప్ సాధించిన ఢిల్లీ జట్టుకు నగదు, షీల్డ్ అందజేత
పురుషుల విభాగంలో చాంపియన్‌షిప్ సాధించిన నాగ్‌పూర్ జట్టుకు నగదు, షీల్డ్ అందజేసిన దృశ్యం
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు


