కోకో ధర భారీగా పతనం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోకో రైతులకు కష్టాలు ఈ ఏడాది కూడా తప్పడం లేదు. సీజన్ ప్రారంభం కాగా.. ధరలు భారీగా పతనం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గతేడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.750 నుంచి రూ.800 పలికిన కోకో ధర ఈ ఏడాది రూ.550కి చేరింది. దీంతో గతేడాది స్థానిక మార్కెట్‌లో రూ.650కి కొనుగోలు చేసిన కోకో ఈ ఏడాది సీజన్ ప్రారంభం కాగా.. రూ.350 నుంచి రూ.400 ధరతో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 వేల ఎకరాల్లో కోకో సాగు జరుగుతుంటే ఒక్క ఏలూరు జిల్లాలో 44,163 ఎకరాలు సాగులో ఉంది. ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా కూడా కోకో సాగులో ఉంది. 2023లో అత్యధికంగా కిలో కోకో రూ. వెయ్యికి పైగా అమ్ముడుకావడంతో అప్పటి వరకు సగటున రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఉన్న కౌలు లీజు ఒక్కసారిగా రూ. 90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరింది. తక్కువ సమయం, ఎకరాకు మూడు క్వింటాళ్ళ దిగుబడితో ఆదాయం బాగుందనే కారణంతో రైతులు కోకో సాగుపై దృష్టి సారించారు. ఇప్పుడు ధరల పతనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులకు అప్పులు మినహా మిగిలే పరిస్థితి లేదు.
సిండికేట్‌లో రైతులు బలి : అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ధర ఉండాలి. దీనిపై గతేడాది కోకో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించి విభిన్న రూపాల్లో నిరసనలు తెలియచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్ళారు. అంతర్జాతీయంగా ఉన్న ధరలో సుమారు 20 నుంచి 30 శాతానికి తక్కువకు స్థానిక చాక్లెట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. గతంలో కంపెనీలు పోటాపోటీగా కొనుగోలుతో రైతుకు మంచి ధర లభించేది. గతేడాది నుంచి కంపెనీలన్నీ సిండికేటై ఒకే ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన సీజన్‌లో ఇంతవరకు సగటున కిలో రూ.550 అత్యధిక ధరకు గాను రైతుకు రూ.400 దక్కింది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.460 ఉండగా, స్ధానిక మార్కెట్‌లో రూ. 350–380కు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే ఆందోళన నెలకొంది.
మార్కెట్‌లో కిలో రూ.550 ఉండగా స్థానికంగా రూ.400కు కొనుగోలు
దేశంలోనే అత్యధిక కోకో సాగు విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే
44 వేల ఎకరాల్లో సాగు
గతేడాది జనవరిలో రూ.650 ధరకు స్థానికంగా కొనుగోలు
కోకో రైతును వెంటాడుతున్న సాగు కష్టాలు
కోకో ధర భారీగా పతనం
కోకో ధర భారీగా పతనం


