బాధ్యతలు స్వీకరించిన జడ్జిలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టులో ఇటీవల నూతనంగా నియమితులైన స్పెషల్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 11 క్లాస్ ఏలూరు జడ్జిగా రావూరి మురళీ కృష్ణ తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మొదటి స్పెషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 11 క్లాస్ జడ్జిగా నండూరి నాగ వెంకట సత్య వరప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలనే ఆకాంక్షతో క్వశ్చన్ బ్యాంక్‌ను తయారు చేశామని డెమోక్రటిక్ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా క్వశ్చన్ బ్యాంక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు మరడాని అచ్యుతరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తలపాటి శ్రీనివాసరావు, శేషపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ రూపొందించామని, ఈ జాబితా జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల లోపు రాతపూర్వకంగా తమ కార్యాలయానికి పంపాలని, గడువు దాటిన తరువాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమన్నారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్లు మంజూరు చేయాలని దళిత సేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ వినతి పత్రం అందజేశారు. రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టే చర్మకారులకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు టౌన్: నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో నేరాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లోని ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నెంబరులో సంప్రదించాలని సూచించారు.
దెందులూరు: ధర్మవరం శివారు నాచుకుంటలో దుండగులు చర్చిని ధ్వంసం చేయడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయటమేనని ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని మతాలను విశ్వాసాలను గౌరవించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిరక్షించాలన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా గుర్తు తెలియని కొందరు ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ఆధ్యాత్మిక సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.


