రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనగిరిపై వేంచేసి ఉన్న స్వయంభు శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహ స్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు సోమవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామికి ఉదయం 9 గంటలకు పంచామృత కలశ స్నపన, స్వామి, అమ్మవార్లకు విశేష అష్టోత్తర శత రజిత తులసీదళార్చన ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పెళ్లి కుమారుడు అలంకరణలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామోత్సవం కల్యాణ మండపం వద్దకు చేరుకోగా భక్తులు విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు.
శోభనాచలుడికి ప్రత్యేక పూజలు
ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తొలి పూజను రాత్రి ఎనిమిది గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. కల్యాణ మహోత్సవంలో స్వామికి వంశపారంపర్య ధర్మకర్త ప్రతాప్ అప్పారావు పట్టు వస్త్రాలు సమర్పించి ఉభయ దాతగా వ్యవహరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహరావు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య, జెడ్పీటీసీ పిన్నిబోయిన వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి, గుర్రం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


