ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీ
● సంక్రాంతి తిరుగు ప్రయాణం భారం
● ట్రావెల్స్ బస్సుల్లో చార్జీల బాదుడు
● రవాణా శాఖ హెచ్చరికలు భేఖాతరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సంక్రాంతి పండుగకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి తిరుగు ప్రయాణం భారంగా మారింది. పండక్కి వచ్చిన అతిథులు శుక్రవారం నుంచి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు. వీరిలో హైదరాబాద్ నుంచి వచ్చిన వారే ఎక్కువ. కాగా ఆర్టీసీ బస్సుల్లో సూపర్ డీలక్స్‌కు హైదరాబాద్‌కు సుమారు రూ.800, నాన్ ఏసీ స్లీపర్ బస్సు స్టార్ లైనర్‌కు రూ.910 వసూలు చేస్తున్నారు. అయి తే ఆర్టీసీ బస్సులు పరిమితంగా ఉండటం, రద్దీ దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా పలు ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేశారు.
విమాన చార్జీలను తలదన్నేలా..
జిల్లాకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు విమాన చార్జీను తలదన్నేలా సంక్రాంతి డిమాండ్ దృష్ట్యా ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచేశాయి. జిల్లాలోని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, కై కలూరు, ఉంగుటూరు, భీమడోలు, చింతలపూడి తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు.
హెచ్చరికలు భేఖాతరు
సంక్రాంతి పండక్కి ముందుగానే జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ ధరలు పెంచవద్దని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలని సూచించారు. కండిషన్‌లో ఉన్న బస్సులు, నిబంధనల మేరకు టాక్స్‌లు చెల్లించడంతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్న బస్సులను మాత్రమే తిప్పాలని ఆదేశించారు. అయితే రవాణా శాఖ అధికారుల ఆదేశాలను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. తిరుగు ప్రయాణానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేలా వారి ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తున్నారు.
కేసుల నమోదు
ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరల దోపిడీకి తెరతీయడంతో వారిని నియంత్రించడానికి రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 9 నుంచి ఇప్పటివరకూ ఏలూరు సమీపంలోని కలపర్రు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి తదితర ప్రధాన ప్రాంతాల్లో వి స్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు వ సూలు చేయడంతో పాటు ఇతర నియమాలను ఉ ల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా ఇప్పటివరకూ 48 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.3.27 లక్షల అపరాధ రుసుం విధించారు.


