విద్యుత్ సర్వీసుల తొలగింపు అన్యాయం
కొయ్యలగూడెం: మండలంలోని సీతంపేటలో గృహాలకు ఉన్న విద్యుత్ సర్వీసుల తొలగింపు వివాదాస్పదమైంది. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది దళితవాడలోని ఇళ్లకు విద్యుత్ సర్వీసులను తొలగించారని బాధితులు ఆరోపించారు. తాము 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ ప్రాంతంపై కన్నేసిన కొందరు కబ్జాకు ప్రయత్నిస్తూ కక్ష సా ధింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తుల పొలం పక్కన తమ ఇళ్లు ఉన్నాయని, వాటిని ఖాళీ చేయించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వచ్చిన పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఉంటున్నామని, ఎలాంటి నోటీసు లు ఇవ్వడకుండా విద్యుత్ సర్వీసులు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందించి గృహాలు నిర్మించాలని కోరుతున్నారు. బాధితులు గాలింకి పద్మ, ఏలేటి కుమారి, ఆరసాల మరియమ్మ, కంటిపటి బులెంకమ్మ, మదలా దుర్గమ్మ తదితరులు విద్యుత్ సర్వీసుల తొలగింపుపై నిరసన తెలిపారు.


