కుంగుతున్న రోడ్లు.. నిత్యం ప్రమాదాలు
ఉండి: కాలువలు, డ్రెయిన్లు పక్కనున్న ప్రధాన రహదారులు కుంగిపోతుండడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు ప్యాచ్‌వర్కుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో మరమ్మతులు చేసిన కొద్దికాలంలోనే రోడ్లు మళ్లీ యథాస్థితికి రావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రమాదాల బారిన వాహనదారులు
కాలువలు, డ్రెయిన్లు పక్కనున్న రోడ్లు కుంగిపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉండి జాతీయ రహదారి చెరుకువాడ నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు సరిహద్దు వరకు సుమారు రెండు కి.మీ.మేర జాతీయరహదారి ఉండి పంటకాలువలోకి కుంగిపోయింది. దీనిలో ప్రధానంగా చెరుకువాడ శివారు రైస్ మిల్లుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే చెరుకువాడ గ్రామ పరిధిలో జాతీయ రహదారి నెత్తురోడుతుంది. నెలలో రెండు నుంచి మూడు భారీ ప్రమాదాలు తప్పడం లేదు.
ఆ దారులు.. యమడేంజర్
● ఉండి సెంటర్ నుంచి గణపవరం వెళ్లే రహదారి.. దాని పక్కనే ప్రవహిస్తున్న బొండాడ మేజర్ డ్రెయిన్‌తో పాటు పిల్ల కాలుల్లోకి కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
● ఉండి మండలం వాండ్రం గ్రామానికి వెళ్లాలంటే ఉండి నుంచి లేదా కాళ్ల మండలం కోపల్లె నుంచి బొండాడ మేజర్ డ్రెయిన్ గట్టుపై వేసిన ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రయాణించాలి. ఈ రోడ్డు సుమారు 6 కి.మీ పొడవున ఉండగా చాలా ప్రాంతాల్లో డ్రెయిన్‌లోకి కుంగిపోయింది. దీనిపై ప్రయాణించే వాహనాలు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి.
● ఇవే కాకుండా నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల్లోనూ ప్రధాన రహదారులు ఆయా ప్రాంతాల్లో కాలువల్లోకి కుంగిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు కుంగిపోతున్న ప్రాంతాల్లో రివిట్‌మెంట్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాలువలు, డ్రెయిన్‌లలోకి జారిపోతున్న ప్రధాన రోడ్లు
ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
రివిట్‌మెంట్ వాల్స్ నిర్మించాలని వేడుకోలు
కుంగుతున్న రోడ్లు.. నిత్యం ప్రమాదాలు


