కమనీయం.. కనుమ ఉత్సవం
● అట్టహాసంగా దొరసానిపాడుకు తరలి వెళ్లిన శ్రీవారు
● ఆకట్టుకున్న చిత్ర విచిత్ర వేషధారణలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కనుమ ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఉత్సవం నిమిత్తం శుక్రవారం దొరసానిపాడు గ్రామానికి తరలివెళ్లిన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు పరవశించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేషధారణలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ దొరసానిపాడు గ్రామంలో సంబరంలా జరిగిన ఈ ఉత్సవం అంబరాన్నంటింది. ముందుగా శ్రీవారి ఆలయంలో మధ్యాహ్నం ఉభయ దేవేరులతో స్వామివారిని రాజాధిరాజ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు, కొండ వెనుక భాగాన ఉన్న దొరసానిపాడు గ్రామానికి కనుమ ఉత్సవం నిమిత్తం అట్టహాసంగా తరలివెళ్లారు. గ్రామంలో మహిళలు శ్రీవారి వాహనం వచ్చే దారి పొడవునా రంగవల్లులను తీర్చిదిద్ది, పూలతో ఘన స్వాగతం పలికారు. దొరసానిపాడు పురవీధుల్లో తిరుగాడిన అనంతరం స్వామివారు రాత్రి కనుమ మండపం వద్దకు చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శ్రీవారు, అమ్మవార్లను మండపంలో ఉంచి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ ఈఓ వై.భద్రాజి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉత్సవంలో వేలాదిగా పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లు గిరిప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
కమనీయం.. కనుమ ఉత్సవం
కమనీయం.. కనుమ ఉత్సవం


