‘తాట్కూరు’ గతి ఇంతేనా?
● ముంపు సాకుతో మరమ్మతులకు నోచుకోని వైనం
● పదేళ్లుగా రైతుల భూములకు అందని సాగునీరు
వేలేరుపాడు: ప్రభుత్వాల పనితీరు పోలవరం ముంపు ప్రాంత రైతులకు శాపంగా మారింది. గోదావరి నీటిని పొలాలకు మళ్ళించేందుకు వేలేరుపాడు మడలంలోని తాట్కూరుగొమ్ములో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పధకం పదేళ్లుగా వృథాగా ఉంది. 2003లో రూ.1.8 కోట్లు వెచ్చించి ఐడీసీ శాఖ కాంట్రాక్టర్ ద్వారా నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం అలంకార ప్రాయంగా మారింది. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన ఎనిమిది ఇన్‌ఫిల్టర్ వెల్స్ గోదావరి నీళ్ళలోనే నిర్మించారు. పంపుహౌస్‌లు, ప్రత్యేక విద్యుత్ లైన్ కూడా నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో మొత్తం 1,054 ఎకరాల ఆయకట్టు ఉంది. 300 మంది రైతులు ఈ ఎత్తిపోతల పథకం సాగునీటిపైనే ఆధారపడ్డారు. నిర్మించిన మూడేళ్లు పథకం బాగానే పనిచేసింది. ఆ తర్వాత మరమ్మతులు రావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్ళుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. దీంతో రైతుల భూములకు చుక్క నీరందడంలేదు. ఐదేళ్ళ క్రితం దీని మరమ్మత్తులకు రూ.20 లక్షలు మంజూరైనప్పటికీ పోలవరం ముంపు సాకుతో నిధులను అధికారులు వెనక్కు పంపారు. రైతులు ఎంత ప్రాధేయపడ్డా వారి గోడును అధికారులు పట్టించుకోకుండా ముంపు ప్రాంతంలో మరమ్మతులు అనవసరమంటూ సాకు చూపారు. ఆ తర్వాత దీని గురించి రైతులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎత్తిపోతలపై ఆశలు వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. గోదావరిలో ఆయిల్ ఇంజన్‌లు, విద్యుత్ మోటరులు వాడుకుంటూ పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన మోటర్‌లు, ఇతర సామాగ్రి శిథిలమైపోతోంది. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి, సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


