పందెం కొట్టిన కోడి
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: పోలీసులపై పందెంరాయుళ్లే పైచేయి సాధించారు. ఉమ్మడి జిల్లా అంతటా కోళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. కూటమి ప్రజా ప్రతినిధులు దగ్గరుండి బరులను ప్రారంభించారు. పందేల మాటున పెద్ద ఎత్తున గుండాట, పేకాట, కోతాట, జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా.
కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారం హోరెత్తించిన పోలీసు యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. మైకులు మూగబోయాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరే కనిపిస్తోంది. కూటమి నేతల ఆధ్వర్యంలో వందకు పైనే బరులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటను మొదలుపెట్టేశారు. డేగాపురం, నరసాపురం, పెదఅమిరంలో క్యాసినోలు ఏర్పాటుచేసి భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే క్యాసినోలోకి వెళ్తున్నట్లు సమాచారం. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. పందెం కోసం పుంజులు తెచ్చినవారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాండ్లు ఇచ్చి గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం స్టాళ్లు ఏర్పాటచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్‌హౌస్‌లు, ప్లాట్లు పేకాట శిబిరాలతో జూద కేంద్రాలుగా మారిపోయాయి.
చేతులు మారుతున్న రూ.కోట్లు
పెద్ద బరుల్లో ఒక్కో పందె రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు జరిగితే, ఓ మాదిరి బరుల్లో రూ.50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు పందేలు జరుగుతున్నాయి. రూ.లక్ష నుంచి రూ.కోట్లలో పై పందేలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా బరులు కలిపి తొలిరోజు రూ. 100 కోట్లకు పైనే నగదు చేతులు మారినట్టు అంచనా.
● ఉండి నియోజకవర్గంలో..
పెదఅమిరంలో స్టేడియంను తలపించేలా ఏర్పాటుచేసిన పందెం బరిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోడి పందేలను ప్రారంభించారు. సీసలి, కలవపూడి, ఆకివీడు, అర్జమూరు, గుమ్ములూరు, సిద్దాపురం, ఉండి, మహదేవపట్నం, పాలకోడేరు, విస్సాకోడేరు, గరగపర్రు తదితర చోట్ల 40 బరుల్లో పందేలు జరుగుతున్నాయి.
● తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో..
నియోజకవర్గంలో 27 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలోని పెద్దబరిలో తొలిరోజు 20 పందేలు రూ. 5 కోట్ల వరకూ సాగాయి. ఒక పందెం రూ.63 లక్షలు వెళ్లింది. ఉదయం కొన్ని బరుల వద్ద పోలీసులు హడావుడి చేసినప్పటికీ తర్వాత షరా మామూలే..
● పాలకొల్లు నియోజకవర్గంలో..
పూలపల్లి, కలగంపూడి, యలమంచిలి, శివదేవుని చిక్కాల, పోడూరు తదితర ప్రాంతాల్లో 25కు పైగా బరులను ఏర్పాటుచేశారు. ఆయా చోట్ల గుండాట, పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డుకుంటామన్న పోలీసులు బరుల వద్ద ఎక్కడా కనిపించలేదు.
● భీమవరం నియోజకవర్గంలో..
ఎనిమిది పెద్ద బరులు, మరో 15 చిన్నబరులు ఏర్పాటు చేశారు. డేగాపురంలోని పెద్ద బరిలో క్యాసినో ఏర్పాటుచేసి బయటివాళ్లను రానివ్వకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రాజసభ సభ్యుడు బీద మస్తానన్ రావు, వైజాగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమవరం మండలంలో జరిగిన బరుల్లో పాల్గొన్నారు.
● తణుకు నియోజకవర్గంలో..
కూటమి నేతల ఆధ్వర్యంలో ఉదయం నుంచే కోడిపందేలు, జూదాలు జోరుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో సుమారు 20 బరులు ఏర్పాట్లు చేసి పందేలు నిర్వహిస్తున్నారు.
● ఆచంట నియోజకవర్గంలో..
పెనుగొండ, దొంగరావిపాలెం, మార్టేరు, సత్యవరం, కవిటం, కొడమంచిలి, చినమల్లం, వల్లూరు, పెళ్లికూతరమ్మ చెరువులో కోడిపందేలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల వరకు హడావుడి చేసిన పోలీసులు వదిలివేయడంతో విచ్చలవిడిగా జూదం, కోడిపందేలు జరిగాయి.
● పోలవరం నియోజకవర్గంలో..
కొమ్ముగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, రెడ్డిగణపవరం, అంతర్వేదిగూడెం, కొవ్వాడ, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, జీలుగుమిల్లి, రాచన్నగూడెంలలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. జీలుగుమిల్లిలో ఎమ్మెల్యే చిర్రా బాలరాజు కోడిపందేలు ప్రారంబించారు. పోలవరంలో గూటాల, పట్టిసీమ, కన్నాపురం అడ్డరోడ్డు, గుంజవరం గ్రామాల్లో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు.
● నూజివీడు నియోజకవర్గంలో..
మీర్జాపురంలో పెద్దెత్తున పందేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం మొత్తంగా 16 చోట్ల భారీగా కోడిపందేలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పందెం సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరుగుతున్నాయి.
● ఉంగుటూరు నియోజకవర్గంలో..
నియోజకవర్గం మొత్తంగా 25 బరులు వేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఒక బరి స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యవేక్షణలో జరుగుతోంది. బలమైన సామాజికవర్గం వారు ఆ బరి వద్ద పాల్గొంటున్నారు. బాదంపూడిలో జరిగే బరిలో పాల్గొనేందుకు రాయలసీమ, తెలంగాణ నుంచి పందెం రాయుళ్లు వస్తున్నారు.
● దెందులూరు నియోజకవర్గంలో..
నియోజకవర్గంలో 15 గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. పెదివేగి మండలంలో దుగ్గిరాల పెద్ద పందేలు జరగగా, ఈ పందేలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షణలో జరిగాయి.
● నరసాపురం నియోజకవర్గంలో..
మొత్తం 25 బరులు వేశారు. గుండాట పేకాట విస్తృతంగా సాగుతోంది. నరసాపురం పట్టణంలోని వీవర్స్‌కాలనీలో ఏర్పాటు చేసిన కోడిపందేలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.
● చింతలపూడి నియోజకవర్గంలో
చింతలపూడి మండలంలో చింతంపల్లి, రేచర్ల, రాఘవాపురం, లింగపాలెం మండలం ములగలంపాడు, కలరాయనగూడెం, మల్లేశ్వరం, కామవరపుకోట మండలం కామవరపుకోట పాతూరు, వెంకటాపురం, రావికంపాడు, రత్నగిరినగర్, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, జంగారెడ్డిగూడెం పట్టణంలో పెద్ద పందేలు జరిగాయి. ములగలంపాడులో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కోడి పందేలను ప్రారంభించారు.
● కై కలూరు నియోజకవర్గంలో..
18 చోట్ల కోడిపందేల బరులను ఏర్పాటు చేశారు. గుండాట, పేకాట, కోతాట కూడా జోరుగా సాగుతోంది. ఇక్కడ అన్నీ చిన్న పందేలే జరుగుతున్నాయి.
ఏలూరు మండలం మాదేపల్లిలో తలపడుతున్న కోళ్లు
బరుల్లో కోట్లాట
పోలీసులపై పందెంరాయుళ్ల పైచేయి
మూగపోయిన పోలీసుల మైకులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూదాల జాతర
బరుల వద్ద గుండాట, పేకాట, కోతాటలు, క్యాసినోలు, మద్యం స్టాళ్లు
కోడి పందేలను ప్రారంభించిన కూటమి నేతలు
పందెం కొట్టిన కోడి
పందెం కొట్టిన కోడి
పందెం కొట్టిన కోడి
పందెం కొట్టిన కోడి
పందెం కొట్టిన కోడి
పందెం కొట్టిన కోడి


