ఊళ్లన్నీ వెలవెల
● సంక్షేమ సాయం లేక సామాన్యుడు ఢీలా
● పెరిగిన నిత్యావసరాల ధరలు
● జగన్ ప్రభుత్వ సంక్షేమ రాజ్యంతో పోల్చుకుని చర్చలు
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి సందడి ఈ సారి కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పండుగలన్నీ వెలవెలబోతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఏదో ఒక రూపంలో ప్రజలకు సహాయం అందేది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో సంక్షేమ పథకాల సొమ్ములు జమ కావడంతో ప్రజలంతా సంతోషంగా పెద్ద పండుగ జరుపుకునేవారు. ఈ రెండేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరి చేతిలోనూ డబ్బులు ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారు, ఇక్కడి వారు అదే విషయమై చర్చించుకుంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలన, ప్రస్తుత కూటమి పాలనను బేరీజు వేసుకుంటున్నారు.
– జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని 8వ వార్డులో రామాలయం వద్ద రచ్చబండలో చర్చ ఇది.
పండుగంటే ఖర్చులే తప్ప ఆదాయం నిల్
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పండుగ అంటేనే ప్రజలు భయపడే స్థితికి వచ్చింది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఉద్యోగ కల్పన లేదు. పేదలకు సరైన ఉపాధి లేదు. మార్కెట్‌లోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు సైతం ఢీలా పడ్డారు. జగనన్న ప్రభుత్వంలో కళకళలాడిన వ్యాపారాలు ఇప్పుడు అంతంతమాత్రంగా సాగుతున్నాయి.
బడులను గాలికొదిలేశారు
నాడు అమ్మ ఒడి ఇస్తే, దానిని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి కొద్ది మందికి డబ్బులు వేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నీరుగార్చారు. నాడు–నేడు పథకం ద్వారా జగనన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తే, వాటిని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. సచివాలయాలు, ఆర్‌బీకేలు నిర్వీర్యం అయ్యాయని చర్చించుకోవడం గమనార్హం. ప్రజా వైద్యానికి జగనన్న పెద్ద పీట వేసి, 17 మెడికల్ కళాశాలలను తీసుకురావడం ద్వారా వైద్యాన్ని మరింత చేరువచేసేలా చూస్తే, ఆయా మెడికల్ కళాశాలల నిర్వహణ తమ వల్ల కాదంటూ పీపీపీ అంటూ ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికి అవకాశం కల్పించారు.
ఎక్కడ వేసి గొంగడి అక్కడే
పెనుగొండ : ‘నాడు సంక్రాంతికి స్వగ్రామానికి వస్తే మార్పు స్పష్టంగా కనిపించేది.. నేడు ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్నట్టుగా రెండేళ్లుగా ఎలాంటి మార్పూ లేదు’ ఇదీ సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వారి మనోగతం. ఏ గ్రామంలో చూసినా ఇదే చర్చ.
ఊళ్లన్నీ వెలవెల


