రానున్నది జగనన్న ప్రభుత్వమే
కాళ్ళ: రానున్నది వైఎస్సార్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా వున్నారని రానున్నది జగన్న ప్రభుత్వమేనని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో భీమవరం, ఉండి నియోజకవర్గ స్థాయి నాయకులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, పూర్వ జేసీ ధాత్రిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హరిదాసుల వేషధారణ, కర్రసాము, రంగవల్లుల పోటీలు, పతంగుల పోటీలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు ఎద్దుల బండిపై సందడి చేశారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ తదితరులు సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు.
భీమవరం: కార్మికులు, కర్షకులు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే నూతన చట్టాలు కాలి బూడిద కావడమే పీడిత ప్రజలకు భోగి వెలుగులని పలువురు ప్రజాసంఘాలు నాయకులన్నారు. బుధవారం భీమవరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో ఉపాధి హామీ, కార్మికులకు నష్టం కలిగించే జీ రామ్ జీ చట్టాల ప్రతులతోపాటు లేబర్ కోడ్ ప్రతులను వేసి దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి లేకుండా చేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయితీలు కల్పించే చట్టాలను భోగి మంటల్లో కాల్చి బూడిద చేయడమే దేశ ప్రజలకు వెలుగన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు, టారిఫ్‌లపై ఈ నెల 20, 22, 23, 27 తేదీలలో ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని ఏపీఈపీడీసీఎల్ తాడేపల్లిగూడెం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నరసింహమూర్తి కోరారు. 20న తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27న కర్నూలులో ప్రజా అభిప్రాయాలను వీడియో కాన్పరెన్స్ ద్వారా తీసుకుంటారని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ స్థానిక జువ్వలపాలెం శివారు డివిజన్ ఈఈ కార్యాలయంలో జరుగుతుందని, ఆయా తేదీలలో విద్యుత్ వినియోగదారులు పాల్గొని అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు.


