ఆదివాసీలంతా కలిసిగట్టుగా ఉండాలి
బుట్టాయగూడెం: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ గిరిపుత్రులు ఒకే వేదికపైకి రావాలని జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు నిరీక్షణరావు పిలుపునిచ్చారు. మండలంలోని మారుమూల గ్రామమైన గుళ్లపూడిలో జాతీయ ఐక్యవేదిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరీక్షణరావు మాట్లాడుతూ ఆదివాసీ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులందరూ ఒకటిగా ఉండి దేశానికి, ప్రపంచానికి మంచి సందేశం అందించే విధంగా ఉండాలని కోరారు. క్రైస్తవులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కొందరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చర్చిలను కూల్చడం, క్రైస్తవులపై దాడి చేయడం దారుణమని అన్నారు. క్రైస్తవులపైనా, ఆదివాసీలపైనా దాడులు చేస్తే సహించమని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


