సిండికేటుకు చంద్రన్న కానుక | - | Sakshi
Sakshi News home page

సిండికేటుకు చంద్రన్న కానుక

Jan 14 2026 9:56 AM | Updated on Jan 14 2026 9:56 AM

సిండికేటుకు చంద్రన్న కానుక

సిండికేటుకు చంద్రన్న కానుక

సిండికేటుకు చంద్రన్న కానుక

పేద, మధ్యతరగతిపై భారం

సాక్షి, భీమవరం: తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. బాటిల్‌పై మరోసారి రూ.10 పెంచారు. లిక్కర్‌ సిండికేటుకు సంక్రాంతి కానుక అందించారు. అమ్మకాలపై ప్రస్తుతం ఉన్న 14 శాతం మార్జిన్‌ను 15 శాతంకు పెంచారు. మరోపక్క బార్లకు అదనపు రిటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను(ఏఆర్‌ఈటీ) రద్దు చేశారు.

జిల్లాలో 194 మద్యం దుకాణాలు కూటమి సిండికేట్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమ్మకాలపై వ్యాపారులకు మొదట్లో 10 శాతంగా ఉన్న మార్జిన్‌ను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 14 శాతంకు పెంచింది. మద్యం బాటిల్‌పై రూ.10 పెంచింది. ఏడాది తిరక్కుండానే రెండోసారి ధరలు పెంచేసింది. రూ.99 క్వార్టర్లు మినహా మిగిలిన అన్ని రకాల బ్రాండ్లపై బాటిల్‌కు రూ.10 పెంచింది. లిక్కర్‌ వ్యాపారుల మార్జిన్‌ పెంచుతూ, బార్లకు ఏఆర్‌ఈటీ రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 8వ తేదీన కేబినేట్‌ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకోగా జీవో విడుదల కాకుండా అదే రోజు నుంచి వ్యాపారులు బాటిల్‌కు రూ.10 చొప్పున పెంచేసి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. పెరిగిన ధరలు 12వ తేదీ నుంచి అమల్లోకి రావడంతో నాలుగురోజులు అదనంగా వసూలు చేసిన సొమ్ములు సిండికేట్లు జేబుల్లోకి వెళ్లిపోయాయి.

బార్లకు మేలుచేస్తూ..

భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలో 31 బార్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన టెండర్లలో 23 బార్లను వ్యాపారులు దక్కించుకున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలో ఎనిమిది బార్లకు ఎవరూ ముందుకు రాక అధికారులు మరోమారు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యం బాటిళ్లపై ఎకై ్సజ్‌ శాఖ 15 శాతం ఏఆర్‌ఈటీ వసూలు చేస్తోంది. ఇది ఎత్తివేయాలన్న డిమాండ్‌ ఉంది. అందుకోసమే లిక్కర్‌ సిండికేట్‌ మిగిలిన బార్లకు టెండర్లు వేయకుండా ఆపివేసిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పన్ను పూర్తిగా రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇకపై షాపు లైసెన్సుదారులకు మాదిరి బార్లకు ఏ విధమైన పన్నులు లేకుంండా డిపోల నుంచి ప్రభుత్వం మద్యం సరఫరా చేయనుంది. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్‌ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేవి. కాగా చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాల ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం.

మరోసారి మద్యం ధరల పెంపు

బాటిల్‌పై రూ.10 బాదుడు

లిక్కర్‌ వ్యాపారుల మార్జిన్‌ 14 నుంచి 15 శాతానికి పెంపు

బార్లకు అదనపు రిటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను రద్దు

కూటమి నేతలు, సిండికేట్‌ జేబుల్లోకి మద్యం ఆదాయం

జిల్లాలో రోజుకు సుమారు నాలుగు కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే. రూ.99 చీఫ్‌ లిక్కర్‌ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120 ఓఏబీ, రూ.130 మంజీర, హెచ్‌డీ, రూ.150 ఖరీదైన క్లాసిక్‌ బ్లూ, ఏసీ బ్లాక్‌, పార్టీ స్పెషల్‌, సిల్వర్‌ బ్రాండ్లు, మధ్యతరగతి వర్గాల వారు రూ.190 ఎంసీ, ఐబీ, ఐకానిక్‌ వైట్‌, ఆప్టర్‌ డార్క్‌, రూ.190 ఎంహెచ్‌ బ్రాందీ, రూ.230 8 పీఎం తదితర క్వార్టర్‌ బాటిల్స్‌ కొనుగోళ్లు చేస్తుంటారు. వీటన్నింటిపైనా అదనంగా ప్రభుత్వం రూ.10 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10 అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో రూ.40 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్‌ బాదుడితో బాటిల్‌పై రూ.30 అదనంగా పెరిగిందని మందుబాబులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement