కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
ఏలూరు(మెట్రో): సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే పల్లె పండుగ, రైతులు పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను కలుసుకుని కనువిందు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను ఆదర్శంగా నిలిచేలా కృషిచేద్దామని కలెక్టరు పిలుపునిచ్చారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత డిసెంబర్ 7న జరిగిన నేషనల్ మీన్స్–కం–మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ నెల 20 నాటికి కులం, ఆదాయం, 7వ తరగతి మార్కుల శాతం సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం జాబితాను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారని, ఆ సమయంలో, అన్ని పత్రాలు, హాల్‌టికెట్ ఫొటోకాపీతో కార్యాలయానికి సమర్పించాలన్నారు. విద్యాశాఖాధికారి పేర్కొన్న తేదీ నాటికి సర్టిఫికెట్ కాపీలను సమర్పించని విద్యార్థుల వివరాలను తుది జాబితా నుంచి తొలగిస్తారని చెప్పారు.
ఏలూరు(మెట్రో): జనగణన –2027 నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టరు ఆఫ్ సెన్సెస్ జె.నివాస్ పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరు మాట్లాడుతూ జనగణన7కు జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రూ.679 కోట్లతో 7 పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తులు అందగా, పరిశ్రమ ఏర్పాటులో వారి సమస్యలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి జూమ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు అనుమతుల జారీలో ఏదైనా సమస్య ఎదురైతే సమస్యను వారితో చర్చించి నిబంధనలకు మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో జిల్లాలో 793 చిన్న, మధ్య, పెద్దతరహా పరిశ్రమలకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసిన యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పాలసీలో ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలకు ఇన్వెస్ట్‌మెంట్, విద్యుత్, వడ్డీ, స్టాంప్ డ్యూటీ రాయితీల కింద 25 యూనిట్లకు రూ.96.04 లక్షలు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది.
కాళ్ల : జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి సాహసోపేత రైడ్ చేసి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. కాళ్ల మండలం పెద అమిరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారా మోటర్ ఎరైవల్ అడ్వెంచర్ స్కై రైడ్‌ను ఏర్పాటు చేయగా, తొలి రైడ్‌ను కలెక్టర్ చేసి యువతను ఉత్సాహపరిచారు. భీమవరం అంటే కోడి పందేలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్‌ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందని కలెక్టర్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజుల్లో యువతకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రైడ్స్ నిర్వహిస్తారని అన్నారు.


