పోటాపోటీగా బరులు
భీమవరం, ఉండిలో పోటాపోటీగా పందెంబరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి పశ్చిమలోనే భారీ బరి భీమవరం రూరల్‌లోని గొల్లవానితిప్ప (డేగాపురం)లో పందెం నిర్వాహకుడు వెంప కాశీ ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో ఒక్కొక్క బరిని భారీగా ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. ఎల్‌ఈడీ స్క్రీన్లు, క్యారవ్యాన్లు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భీమవరంలోని ప్రకాష్‌నగర్‌లోని లేఅవుట్‌లో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తనయుడు నేతృత్వంలో భారీ బరిని ఏర్పాటు చేసి రూ.25 లక్షల నుంచి పందేలు నిర్వహిస్తున్నారు. ఉండిలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసలిలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు సోదరుడు నేతృత్వంలో 5 ఎకరాల బరిని సిద్ధం చేసి ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఏసీ గ్యాలరీలు, ఫ్లడ్‌లైట్లు, బౌన్సర్లు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు. ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహకారంతో కోడి పందేల శిబిరాల నిర్వాహకుడు గబ్బర్ బరిని సిద్ధం చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో బరిని ఏర్పాట్లు చేసి ఎల్‌ఈడీలు, భారీ స్వాగతద్వారాలు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులను కూడా బరికి ఆహ్వానించారు. ప్రత్యేకంగా వీఐపీల కోసం కోడి పందేల శిబిరం వద్దే తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి లక్షల్లో పందేలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెంలో వెంకట్రామయ్య బరిలో రూ. కోటి పందాన్ని మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఎక్కువ పందేలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నారు. ఉంగుటూరులోని నారాయణపురంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లేఅవుట్‌లో ఆయన సహకారంతో భారీ శిబిరం ఏర్పాటు చేసి రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురంలోనూ భారీగా బరులు ఏర్పాటయ్యాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఇదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు.


