భోగి మంటల్లో వేయాలి
ఏలూరు (టూటౌన్): జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చి పేదల ఉసురు తీస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఉసురు తీస్తుందన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తూ.. పని దినాలు పెంచామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు 90 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర వాటా పది శాతంగా ఉండేదని తెలిపారు. నేడు రాష్ట్రాలపై భారం వేస్తూ ఒకేసారి 40 శాతం రాష్ట్రాలు భరించాలంటే ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ చట్ట రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. జనవరి 14న భోగిమంటల్లో ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.


