రూ.20 కోట్ల దారి మళ్లింపు
ఏలూరు (టూటౌన్): చంద్రబాబు ప్రభుత్వం పథకాల ప్రచారం పేరుతో దారి మళ్లించిన రూ.20 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు వెంటనే కార్మికుల కోసం వినియోగించాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్షట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే 100 రోజులలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కనపెట్టి పథకాల ప్రచారం పేరుతో రూ.20 కోట్లు దుర్వినియోగం చేయడం దుర్మార్గమన్నారు. కార్మిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వందల కోట్ల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను దారిమళ్లిస్తున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.


