పాపికొండల్లో హాయి హాయిగా..
బుట్టాయగూడెం: గలగల పారే గోదారిలో లాంచీ ప్రయాణం నడుమ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఒక అద్భుతం. అందులోని గోదారమ్మను ఆనుకొని పాపికొండల నడుమ సాగే బోటు ప్రయాణం ఓ మధురానుభూతి. దీంతో పాపికొండలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పర్యాటకులు ఆసక్తికగా ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి పండుగ వేళ సెలవులు దొరకడంతో కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు పర్యాటకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల టూర్‌కు వెళ్లేందుకు ఇప్పటికే కొందరు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు సెలవులపై వచ్చిన వారు సైతం ఇక్కడ చిల్ అయ్యేందుకు తరలి వస్తుండడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
సందర్శన స్థలాలు
పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
గిరిజనుల ఆప్యాయత, ఆదరణ
పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వారు వెదురుతో తయారు చేసిన రకరకాల కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాపికొండల పర్యటనకు వెళ్లిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవి కొనుగోలు చేసి యాత్రకు గుర్తుగా ఇళ్లకు తీసుకువెళ్తూ ఉంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే సుమారు 5 గంటలకు పైగా ఈ యాత్ర ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. కాగా పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి
సంక్రాంతి పండుగ సెలవులకునెలకొన్న రద్దీ
యాత్రికుల కోసం అందుబాటులోకి సౌకర్యాలు
పాపికొండల్లో హాయి హాయిగా..
పాపికొండల్లో హాయి హాయిగా..


