నిడమర్రు ఎఫ్‌డీవో రవి సస్పెన్షన్
నిడమర్రు: నిడమర్రు ఎఫ్‌డీవో టీవీ రవికుమార్‌ను మంగళవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ తెలిపారు. నిడమర్రు మండలం అడవికొలను పంచాయతీ తిమ్మారావు గూడెం రెవెన్యూ గ్రామం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వేవారిపై చర్యలు తీసుకోకుండా విధులు దుర్వినియోగం చేస్తున్నాడని స్థానిక రైతు గంగుల సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం మత్య్సశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి నిడమర్రు ఎఫ్‌డీవో టీవీ రవికుమార్‌పై చార్జ్‌స్ ప్రేమ్ చేసి విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఎప్‌డీవో టీవీ రవికుమార్‌ను సస్పెండ్ చేసినట్లు డీఎఫ్‌వో బి.రాజకుమార్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పారిజాతగిరి ఆర్చి వద్ద పట్టణానికి చెందిన సొలస వెంకట సురేష్‌కుమార్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో 20ఏళ్ల వయసున్న మారుజాతి చెట్లు ఉన్నాయి. వాటిని ఈవో తన కారు హెడ్‌లైట్ వెలుతురులో ఏడుగురు కూలీలను పెట్టి నరికించి ట్రాక్టర్‌పై తరలిస్తుండగా తాను గుర్తించానని, సొలస సురేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


