నేషనల్ పార్క్‌లో గొర్రెలు పెంచరాదు
పోలవరం రూరల్: పాపికొండలు నేషనల్ పార్క్ ప్రాంతంలో గొర్రెల పెంపకం చేస్తే చర్యలు తీసుకుంటామని అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్‌కే వలీ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన నదీపరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా మేత, నీరు ఉండటంతో గొర్రెల కాపరులు ఈ ప్రాంతాన్ని గొర్రెల పెంపకానికి వినియోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం గొర్రెల కాపరులు మెత్తాపుకోట, ఉడతపల్లి మీదుగా గొర్రెలను అటవీప్రాంతంలో దాటించే సమయంలో కాపరులకు, అటవీ శాఖ సిబ్బందికి మధ్య దీనిపై వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 10 గొర్రెలను అటవీశాఖ సిబ్బంది నిలిపివేయడంతో గొర్రెల కాపరులు మంగళవారం ఉదయం అటవీశాఖ కార్యాలయానికి చేరుకుని రేంజర్ ఎస్‌కే వలీకి విషయం తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ ప్రాంతంలో గొర్రెల పెంపకాలు జరపడం వలన వన్యప్రాణులకు విఘాతం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయని వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెలను బయటకు తరలించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో 10 రోజుల్లో గొర్రెలను బయటకు తరలిస్తామని కాపరులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ తెలిపారు.
రేంజర్ ఎస్‌కే వలీ


