పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కేసులు
జంగారెడ్డిగూడెం: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిపై 6–ఏ కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక ప్రకటనలో తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు మండలంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి , అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి సదరు బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. పట్టుకున్న 78.64 క్వింటాళ్ల బియ్యాన్ని ఈ నెల 17న తహసీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఈ వేలం పాటకు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉన్న రైస్ ట్రేడర్స్, రిటైలర్, రైస్ మిల్లర్‌లు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.
గణపవరం: గణపవరంలోని చినరామచద్రపురంలో కోడికత్తులు తయారు చేస్తున్న ముసినాని శివాజీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. అతని వద్దనుంచి సుమారు 300 సాన పట్టిన కత్తులు, మరో 200 సానపట్టని కత్తులతో పాటు, సానపట్టే మోటార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శివాజీ సంక్రాంతికి భారీగా కోడికత్తులు తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంపై సీఐ నక్కా రజనీకుమార్, ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడిచేసి అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బంది డి.శివాజీ, డి.రత్నాభాయి, జె.బాబీ, పి.జగపతిలను ఆయన అభినందించారు.


