పోలీసుల సేవలు భేష్
ఏలూరు టౌన్: తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను ఏలూరు టూటౌన్ పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అలాగే పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగించారు. దీంతో పోలీసుల సేవలను ప్రశంసిస్తున్నారు.
ఏలూరు టూటౌన్ పరిధిలోని తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన నరేష్, భార్గవిలకు బండి హర్షిణి సహస్ర (3), తేజీ శ్రీదస్ (5) అనే చిన్నారులు ఉన్నారు. వీరు ఇంటివద్ద ఆడుకుంటూ మంగళవారం బయటకు వెళ్లి తప్పిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెదికినా పిల్లలు కనిపించకపోవడంతో డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ వెంటనే ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్‌ను అప్రమత్తం చేయగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిమిషాల వ్యవధిలో చిన్నారులు ఇద్దరూ లంకపేట ప్రాంతంలో ఉండగా గుర్తించిన టూటౌన్ ఎస్సై మధు వెంకట రాజా, సిబ్బంది పిల్లలను ఇంటికి చేర్చారు.
పర్సు అప్పగింత
హైదరాబాద్‌కు చెందిన ఎర్రమిల్లి ఉదయ్‌శర్మ ఏలూరులోని ఎస్‌ఎంఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన రైల్వే స్టేషన్ పరిసరాల్లో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో రూ.8700 నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్, ఈ.సతీష్‌కి ఆ పర్సు దొరకగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాధితుడు ఉదయ్‌శర్మ వివరాలను సేకరించి మంగళవారం ఆ పర్సును అతడికి అందజేశారు.


