ఉద్యమాలపై ఉక్కుపాదం తగదు
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రజాఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని, అ నకాపల్లి జిల్లాలో రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్టును ఎత్తివేయాలని, బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కా ర్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ అప్పలరాజుపై ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్టు పెట్టిందన్నారు. బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో గిరిజన రైతుల సాగులో ఉన్న భూముల్లోని మొక్కజొన్న ఇతర పంటల ను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. విశా ఖలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వి ద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీషీట్ ఓపెన్ చేయడం తగదన్నారు. ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రభుత్వం ఆపాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరి బ త్తుల సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ పీడీ యాక్టు సిగ్గుచేటు
భీమవరం : ప్రశ్నించే గొంతులపై పీడి యాక్ట్‌లను, రౌడీషీట్లను ప్రయోగిస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రైతు సంఘం రాష్ట్ర నేత బి.బలరాం హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలను కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశంచౌక్‌లో సోమవారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ నక్కపల్లి ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేస్తున్న అప్పలరాజు ప్రజలకు అండగా నిలవడం నేరమా అని ప్రశ్నించారు. గంజాయి, మద్యం, ఇసుక మాఫియా లాంటి వారిపై పెట్టాల్సిన కేసులు ప్రజలకు అండగా నిలిచే వారిపై పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో బుట్టాయగూడెం మండలంలో గిరిజనుల భూముల్లో వేసుకున్న పంటలను ట్రాక్టర్లతో దున్ని నాశనం చేయడమే కాకుండా గిరిజను లు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా ఉందన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, వృత్తి సంఘాల జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


