ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి
పెనుగొండ: ప్రభుత్వ విద్యా సంస్థలకు దీటుగా సేవలందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. పెనుగొండలోని ఎస్వీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సరైన వనరులు, సదుపాయాలు సమకూర్చకపోవడంతో నిర్వహణతో పాటు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై విద్యాశాఖా మంత్రి లోకేష్ దృష్టికి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపి మూర్తిలతో కలసి తీసుకువెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా శాసన మండలిలోనూ ప్రస్తావిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపీ మూర్తి మాట్లాడుతూ ఉన్నతాశయాలతో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కళాశాలను పేద విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు సేకరించిన విరాళాన్ని అతిథుల చేతుల మీదుగా పాలకవర్గానికి అందించారు. కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు, పాలకవర్గ అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ వైవీవీ అప్పారావు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12 జనసాధారణ (అన్ రిజర్వ్‌డ్) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్టణం–విజయవాడ మధ్య ఆరు సర్వీసులు ఈ నెల 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. ఈ రైలు ఉదయం 10 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఆరు సర్వీసులు నడుపనున్నారు. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 12.35 గంటలకు విశాఖపట్టణం చేరుతుంది.
కాకినాడ టౌన్ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
కాకినాడ టౌన్–చర్లపల్లి మధ్య ఈనెల 19న రైలు సర్వీసు నడుపనున్నారు. ఈ రైలు కాకినాడ టౌన్‌లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగనుంది.
ఇక్కడ సంక్రాంతి
ఎంతో అనుభూతి
భీమవరం: గత ఏడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఆగస్టు 15 లోపు ఆ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. సోమవారం భీమవరం విచ్చేసిన ఆయన నానాజీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడారు. 20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించామని, భీమవరం టాకీస్ పతాకంపై నిర్మించిన 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించామన్నారు. మిగిలిన 8 చిత్రాల ట్రైలర్స్‌ను ఒకేసారి విడుదల చేయబోతున్నామ న్నారు. ప్రతి సంక్రాంతికి భీమవరం వస్తానని, భీమవరం అనుభూతి మరువలేనని అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్ దరఖాస్తులపై ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ఈ ప్రజా విచారణలు జరుగుతాయన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయన్నారు. ఈ ప్రజా విచారణల ప్రత్యక్ష ప్రసారం ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి


