రాగి వైర్ల చోరీ ముఠా అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు చోరీ చేసే ముఠాని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన కామవరపుకోట మండలం కేఎస్ రామవరంలో వ్యవసాయ పొలంలో గల నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లలోని రాగివైరు చోరీకి గురైందన్నారు. దీనిపై రైతులు తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన కర్ని నాగశివ, చిలకలూరిపేట మండలం రామచంద్రాపురంనకు చెందిన గౌరవరపు దివాకర్‌బాబు, మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన మహంకాళి కిషోర్, తెలంగాణ రాష్ట్రం మహాబూబ్‌నగర్ జిల్లా బెబ్బెరుకు చెందిన డక్కలి సురేంద్రలను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని విచారించగా, మొత్తం 22 కేసులకు సంబంధించి 40 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీ చేసినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి సుమారు రూ.50 వేలు విలువ చేసే 50 కిలోల రాగివైరు, వైర్ల కటింగ్ అవసరమైన సామాగ్రి, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన జంగారెడ్డిగూడెం, తడికలపూడి ఎస్సైలు ఎన్‌వీ ప్రసాద్, పి.చెన్నారావు, క్రైంపార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లను ఏఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు.


