పాలకొల్లులో చెస్ పోటీలు
పాలకొల్లు సెంట్రల్: మేధా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు సోమవారం పాలకొల్లులో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగదీష్, మేధా చెస్ అకాడమీ ప్రెసిడెంట్, ఆడిటర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, చాంబర్స్ ప్రెసిడెంట్ కారుమూరి నరసింహరావు, మద్దాల వాసులు మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. పోటీల్లో కాకినాడ జిల్లా వాసి జాన్స జాన్ సాయి సంతోష్ ప్రథమ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన షణ్ముఖ రెడ్డి ద్వితీయ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్‌చరణ్‌తేజ్ తృతీయ బహుమతి సాధించారు. వివిధ కేటగిరిలో అండర్ 7, 9, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు.
నరసాపురం రూరల్: ఆలయాల్లో జరుగుతున్న చోరీలకు సంబంధించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సోమవారం డీఎస్పీ జి శ్రీవేద వివరాలు వెల్లడించారు. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. ఈ చోరీ కేసుల్లో నిందితుడైన కాళీపట్నం పడమర గ్రామానికి చెందిన కవురు లోకేశ్వరరావు అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.57లక్షలు విలువ గల 1.420 కేజీల వెండి, రూ.1.77 లక్షలు విలువగల 14 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.


