కుట్రలతోనే కవ్వింపులు
అక్రమ కేసులు పెట్టేందుకే ఫ్లెక్సీలు
సాక్షి, భీమవరం: తణుకు ప్రశాంతతను భగ్నం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. మొన్న తణుకులో మొదలైన కూటమి కవ్వింపు చర్యలు తాజాగా ఉదరాళ్లపాలెంకు వ్యాపించాయి.
సాధారణంగా పండుగల సందర్భంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏ పార్టీ నేతల విగ్రహాల చెంతన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం పరిపాటి. అందుకు భిన్నంగా తణుకు వై.జంక్షనన్‌లో వైఎస్సార్ విగ్రహం ముందుభాగంలో గత నెల 25న రాత్రి సమయంలో పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కూటమి అగ్రనాయకత్వం, ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. తమ అభిమాన నాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీని తొలగించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు లాక్కున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విషయం తెలిసి హుటాహుటిన తణుకు చేరుకుని పార్టీ శ్రేణులతో ఆందోళనకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఘటన స్థలం వద్ద వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 26వ తేదీ తెల్లవారుజామున పోలీసులు రెండు ఫ్లెక్సీలు తొలగించారు. 144 సెక్షన్ విధించామని మైకులో ప్రచారం చేయడంతో పాటు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఘటన స్థలం నేషనల్ హైవేకు సంబంధించిందని, ఇక్కడ ఏ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయరాదని హెచ్చరిక బోర్డుతో విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఆ రోజు నుంచి విగ్రహం వద్ద పగలు, రాత్రి పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారు.
తణుకులో పరిస్థితి ఇలా ఉంటే శనివారం అత్తిలి మండలంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పర్యటనను పురస్కరించుకుని ఉదరాళ్లపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. మెయినన్ రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద మాజీ మంత్రి కారుమూరిని కించపర్చేలా ఊరు, పేరు లేకుండా ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయం నుంచి ఫ్లెక్సీలు ఉన్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారని, వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ శ్రేణులు నిరసన చేపట్టగా వాటిని తొలగించారంటున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంతకు పేరొందిన తణుకు నియోజకవర్గంలో ప్రతిపక్ష సభ్యులను కవ్వించి గొడవలు సృష్టించే కుట్రల్లో భాగంగానే ఈ తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి దుశ్చర్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారం ఇచ్చిన ప్రజానీకానికి మంచి పాలన అందించడం కంటే ప్రతిపక్షం వారిని ఏదోరకంగా కవ్వించి విధ్వంసాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో చేసిన సంక్షేమం, అభివృద్ధికి ధీటుగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే సంతోషిస్తాం. ఫ్లెక్సీలు పెట్టి గొడవలు సృష్టించాలనే చీఫ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీ కట్టడం ఏమిటని ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఉరదాళ్లపాలెంలో నన్ను అవమానించాలనే ఉద్దేశ్యంతో ఫ్లెక్సీలు పెట్టి శునకానందం పొందుతున్నారు. గొడవలు సృష్టించి మాపై కేసులు నమోదుచేయించడమే లక్ష్యంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నేడు వారు చేస్తున్నవన్నీ వారికి చేరే రోజులు వస్తాయి.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి
ఫ్లెక్సీలతో ప్రశాంతతను భగ్నం చేసే కుట్రలు
మొన్న తణుకులో.. నిన్న ఉదరాళ్లపాలెంలో
కూటమి నేతల కవ్వింపు చర్యలు
కుట్రలతోనే కవ్వింపులు
కుట్రలతోనే కవ్వింపులు


