పండక్కి పప్పన్నం లేనట్లే..!
భయపెడుతున్న ధరలు
● పట్టించుకోని చంద్రబాబు సర్కారు
● మార్కెట్‌లో ధరల దరువు... ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు
ఏలూరు (మెట్రో) : ఓ వైపు ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే ప్రభుత్వం అందించాల్సిన నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం తగ్గించేస్తుంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకూ జిల్లా రేషన్‌కార్డుదారులకు నిత్యావసరాలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది.
సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగకు నిత్యావసరాలు పూర్తిస్థాయిలో చంద్రబాబు సర్కారు అందించిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కనీసం బెల్లం, కందిపప్పు వంటివి కార్డుదారులకు అందిస్తే పండుగకు కాస్త ఆదరణ కల్పించినట్లు అవుతుంది. చంద్రబాబు సర్కారు దోపిడీనే రాజ్యంగా పాలన సాగిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యాన్ని మాత్రమే కార్డుదారులకు అందిస్తూ చేతులు దులుపుకుంటున్న చంద్రబాబు సర్కారు రాగులు, జొన్నలు వంటివి అందిస్తామని ప్రచారాలు చేసినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేదు. కనీసం పెద్దపండుగ సంక్రాంతికి అయినా అందిస్తారని ఆశించినా అదీ లేకుండా పోయింది. కేవలం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నా ఆ పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని కార్డుదారులు లబోదిబోమంటున్నారు.
బెల్లం, కందిపప్పు ఊసే లేదు
జిల్లాలో 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,31,044 కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదారను మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. కనీసం కార్డుదారులకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తే 631 టన్నులు అవసరం అవుతుంది. అరకేజీ చొప్పున 315 టన్నుల బెల్లం మాత్రమే అవసరం. ఇవేమీ పండుగకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, బెల్లం, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కంపెనీని బట్టి లీటరు వంట నూనె రు.140 నుంచి రు.160 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు పిండివంటలు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రజలకు అందించే కాస్త సరుకులనూ ప్రభుత్వం అందించేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కేజీ కందిపప్పు రూ.180 వరకూ ధర పలికింది. ప్రస్తుతం రూ.110కి చేరుకుంది. కందిపప్పు కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయారు. చంద్రబాబు సర్కారు చోద్యం చూస్తోంది.


