వడ్డే ఓబన్నకు నివాళి
ఏలూరు(మెట్రో) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఈఎల్ బకాయిలు కాలయాపన లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్–1938) ఏలూరు జిల్లా శాఖ అధ్యక్షుడు ఈ.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కుల కోసం నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయులు వివిధ అత్యవసర అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పీఎఫ్ రుణాలను కూడా ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్జిత సెలవుల బకాయిలు, పీఎఫ్ రుణాలు ప్రభుత్వ దయాధర్మాలు కావని, ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన పీఎఫ్ రుణాలను కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ జీ కృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పెనుగొండ: జాతీయ విద్యావిధానం–2020 ద్వారా ఉన్నత విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని ఉన్నత విద్య జాతీయ డైరెక్టరు చప్పిడి కృష్ణ అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు– పరిష్కారంపై ఆదివారం జాతీయ సదస్సులో పాల్గొన్నారు. 2020 జాతీయవిద్యా విధానం 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ప్రస్తుతం ఐదు సంవత్సరాలు గడిచాయన్నారు. పెనుగొండ ఎస్వీకేపీలో నాణ్యమైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గం ఎప్పటికపుడు మార్పు చెందుతూ ముందుకు సాగడంతో ముందంజలో ఉందన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీనివాసన్, శివనాడార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జయదేవ్, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ రామచంద్రరాజు పాల్గొన్నారు.
పెనుగొండ: విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువును సిద్ధాంతం విద్యార్ధులు వినూత్న రీతిలో గౌరవించి భక్తిని చాటుకున్నారు. సిద్ధాంతానికి చెందిన ఉపాధ్యాయుడు బండారు వెంకటేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చేశారు. 30 ఏళ్లుగా వెంకటేశ్వరరావు వద్ద విద్యనభ్యసించిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం గురువుకు ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో కేరళ వాద్యాలతో హోరెత్తించారు. వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు.
వడ్డే ఓబన్నకు నివాళి


