నత్తనడకన జలజీవన్ మిషన్ పనులు
గణపవరం: గణపవరం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణ విస్తీర్ణం పెరిగిపోవడంతో పాటు పాత పైపులైన్లు పాడయ్యాయి. శివారు ప్రాంతాల ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. పైపుల ద్వారా సురక్షిత మంచినీరు లభించక ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. వీటికి పరిష్కారంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్ పథకం నుంచి రూ.3.11 కోట్లను మంజూరు చేయించారు. ఈ పథకంలో 1.20 లక్షల లీటర్ల ఓహెచ్‌ఎస్‌ఆర్, 100 కెఎల్ సామర్థ్యం కలిగిన సంపు, 200 ఎంఎల్ మైక్రోఫిల్టర్, 15 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ పథకానికి 2022 అక్టోబర్ 26న అప్పటి వాసుబాబు శంకుస్థాపన చేశారు. తొలిదశలో మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. గ్రామంలో 15 కిలోమీటర్ల మేర పాత పైపులైన్లు తొలగించి, కొత్తపైపులు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ముమ్మరంగా సాగిన పనులు సాధారణ ఎన్నికలు రావడంతో మందగించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపు నిర్మించినా తుదిదశ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మైక్రో ఫిల్టర్ నిర్మాణం చేయాల్సి ఉంది. 15 కిలోమీటర్ల కొత్త పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. కొత్త పైపులైన్లు వేయడం పూర్తయితే పట్టణంలో దాదాపు రెండువేల పైచిలుకు ప్రైవేటు కుళాయిలను కొత్త పైపులైన్లకు మార్చాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు, మార్జిన్‌లు తవ్విన సమయంలో కొన్ని చోట్ల పాత పైపులైన్లు దెబ్బతిని వాటి ద్వారా కుళాయిల్లో మురుగునీరు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు చేపట్టి జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజల మంచి నీటికష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
గణపవరం మంచినీటి సమస్యకు మోక్షమెప్పుడో?


