కూటమి నిర్వాకంతోనే ఆలయాల్లో అపచారాలు
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో దేవాలయాలపై దాడులు, అపవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తాజాగా ఉచిత ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిందన్నారు. అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులతో ఉన్న ఆవు పాలను వినియోగించడమనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్గమ్మ ఆలయానికి ఏకంగా కరెంటు సరఫరాను నిలిపివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారికి జరుగుతున్న అపచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే గోవులు చనిపోయాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఉన్మాదకరంగా మాట్లాడటం దారుణమన్నారు. డిప్యైటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనమని డ్రామాలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. పొద్దున సనాతన వేషం, రెండో పూట ఇంకేం వేషం వేస్తాడో తెలియదన్నారు. వీకెండ్ వస్తే సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళిపోతున్నారని, డిప్యూటీ సీఎం అయితే వారంలో ఒకసారి మాత్రమే మన రాష్ట్రానికి వస్తున్నాడన్నారు. ఇక మంత్రులైతే ఉంటే హైదరాబాద్ లోని పబ్బుల్లో, లేదంటే హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు చేస్తుంటారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పార్టీ గోపాలపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, తదితరులున్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి


