మాంసాహారం ధరలకు రెక్కలు
తణుకు అర్బన్ : చికెన్, మటన్, చేపల ధరలు షాకిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకూ రూ.260 ఉన్న బ్రాయిలర్ చికెన్ నేడు రూ.320కు చేరుకోవడంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు. ముక్కలేనిదో ముద్దదిగని వారంతా మార్కెట్‌లో మాంసాహారం ధరలు చూసి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం తినాల్సిందే అనే ధోరణిలో ఉన్నవారు మార్కెట్‌లో ధరలు చూసి ఏం తినాలి.. ఏం కొనాలనే ధోరణిలో ఉన్నారు. మటన్ రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండగా చేప ధర కిలో రూ.220గా ఉంది. చికెన్‌కు విక్రయాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో కిలో కొనేవారు అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గాయని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు.
జిల్లాలో రిటైల్ వ్యాపారంలో రోజుకు 30 వేల కిలోలకుపైగా చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో రెట్టింపు అమ్మకాలు జరుగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మటన్ విషయానికి వస్తే రోజూ 20 వేల కిలోల అమ్మకాలు జరుగుతుండగా, చేపలు ఆదివారం ఒక్కరోజే 50 వేల కిలోలకుపైగా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. మాంసాహారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా మాంసాహార ధరలు విపరీతంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని విమర్శిస్తున్నారు.


