బాస్కెట్‌బాల్ పోటీలు నూజివీడుకు గర్వకారణం
నూజివీడు: బాస్కెట్‌బాల్ పోటీలు నూజివీడుకే గర్వకారణమని మున్సిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ అన్నారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్ధూర్ 49వ స్మారక జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ త్రివేణీదుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. 49 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా నూజివీడులో బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. పురుషుల విభాగంలో తొలి మ్యాచ్ నూజివీడు–కావలి జట్ల మధ్య నిర్వహించారు. సీఐ పీ సత్య శ్రీనివాస్, టోర్నమెంట్ కన్వీనర్ పీ సాధన, కృష్ణాజిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సత్యన్నారాయణ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్‌లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.


