మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
నెల రోజులపాటు జాతర
● రేపటి నుంచి 62వ వార్షిక మహోత్సవాలు
● ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 వరకు జరుగనున్న జాతర మహోత్సవాలకు సంబంధించి నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఆమ్మవారి అలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, ఆలయానికి నాలుగు దిక్కుల్లో ఆధ్యాత్మిక భావన కలిగేలా సెట్టింగ్‌లు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్‌లు సిద్ధం చేశారు.
ఉత్సవాల్లో కార్యక్రమాలు ఇలా..
ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బురక్రథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరిలు ఏర్పాటుచేశారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బురక్రథలు, 15 వరకూ సినీసంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
5 నుంచి ప్రత్యేక అలంకరణలు
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి అష్టలక్ష్మీలుగా ప్రత్యేక అలంకరణలు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అన్నపూర్ణదేవి అలంకరణలో పూజలు అందుకుంటారు.
భారీగా భక్తుల రాక
అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు రావడంతో పాటు, రాష్ట్రాంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కొనసీమ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా సంక్రాంతి నాలుగు రోజులు అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపొతుంది.
ఫిబ్రవరి 13న లక్ష మందికి అన్నదానం
అమ్మవారి ఉత్సవాలను, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయం వద్ద నెల రోజులపాటు ఉత్సవ నిర్వాహకులు ఉచిత అన్నదానానికి ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆఖరి రోజు ఫిబ్రవరి 13వ తేదీన మహా అన్నదానం నిర్వహిస్తారు. సుమారు లక్ష మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడాన్ని జిల్లా ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తారు.
ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం భీమవరం డీఎస్పీ రఘువీర విష్ణు పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వాహకులు, దేవస్ధానం సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు.
ఈనెల 13 నుంచి భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ 62వ వార్షిక జాతరను నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5.15 గంటలకు వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు దంపతులు కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సాయంత్రం 4 గంటలకు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డి ప్రారంభిస్తారన్నారు. సుమారు రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల నెల రోజుల పాటు నాటకాలు, బుర్రకథలు, హరికథలు, కూచిపూడి, భరతనాట్యం, సినీ ఆర్కెస్ట్రాలు ప్రతి రోజు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు తూటరపు ఏడుకొండలు, కొప్పుల సత్తిబాబు, రామాయణం చిన్నారి, కొప్పుల రంగారావు, రామాయణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ


