రణరంగంలా నరసాపురం కౌన్సిల్ సమావేశం
కమిషనర్ సేవలు మాకొద్దు
నరసాపురం: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ స మావేశం రణరంగంలా మారింది. మున్సిపల్ ముఖ్య అధికారి పర్సంటేజీల బాగోతం, ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు పట్టుకెళ్లి ఇవ్వడం లాంటి వ్యవహారాలను వెలుగులోకి తీసుకొస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై మొదట సమావేళంలో తీవ్ర చర్చ సాగింది. ఈ వ్యవహారాలు నడి పింది మున్సిపల్ కమిషనరేనని, అతన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని సమావేశం తీర్మానం చేసింది. తరువాత సమావేశం తీరు మొత్తం యూటర్న్ తీసుకుంది. చెత్తను డంప్ చేసే స్థలం లేకపోవడంతో ఇటీవల పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. అయితే మంగళగుంటపాలెంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 8 వేల మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట చెత్తను డంప్ చేయాలని, అక్కడ రోడ్డు నిర్మించే అంశాన్ని ఆమోదించాలని నలుగురు జనసేన కౌన్సిలర్లు, కౌన్సిల్‌లో ఉన్న ఏకైక టీడీపీ సభ్యుడు, మరో స్వతంత్ర సభ్యు డు, వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, వన్నెంరెడ్డి శ్రీనివాస్, మరో ఇద్దరు ఫిరాయింపు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఆ అంశాన్ని ఆమోదించి కదలాలని చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణపై, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చైర్‌పర్సన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో విపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈలోపు ఫిరాయింపు కౌన్సిలర్ భర్త, మున్సిపల్ కాంట్రాక్టర్ గోరు సత్తిబాబు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేశాడు. దీంతో చైర్‌పర్సన్ సహా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లే దారిలేకపోయింది. జగనన్న కాలనీ లేఅవుట్‌లో చెత్తవేయడానికి అనుకూలంగా రోడ్డు నిర్మించే అంశానికి సంబంధించి మినిట్స్ బుక్‌లో సంతకం పెడితేనే బయటకు పంపిస్తామని ఆందోళన చేస్తున్న కౌన్సిలర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కౌన్సిలర్లలో 16 మంది మహిళలు ఉన్నారని, షుగర్, బీపీ పేషెంట్లు ఉన్నారని, ఎవరో సంబంధంలేని కాంట్రాక్టర్ తాళం వేయడం ఏమిటని చైర్‌పర్సన్ పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించారు తప్ప సమస్య పరిష్కరించకపోవడం గమనార్హం. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, లోపల చిక్కుకుపోయినవారు సాయంత్రం 5 గంటల వరకు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చైర్‌పర్సన్ భర్త, 5వ వార్డు కౌన్సిలర్ తాళం పగలగొట్టడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు బయటకు వచ్చారు. ఈ సందర్భంలో కూడా విపక్ష కౌన్సిలర్లు వారిని అటకాయించే ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద బయటకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ అక్కడి నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ గోరు సత్తిబాబుపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
జగనన్న కాలనీలో చెత్తను డంప్ చేయాలని దుర్మార్గ ఆలోచన
వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు, చైర్‌పర్సన్‌ల నిర్బంధం
మున్సిపల్ కార్యాలయానికి తాళం
పోలీసుల ప్రేక్షక పాత్ర
తాళం పగలగొట్టుకుని బయటపడ్డ కౌన్సిలర్లు
అంతకు ముందు ‘సాక్షి’ కథనంపై దుమారం
మున్సిపల్ కమిషనర్‌ను సరెండర్ చేస్తూ తీర్మానం
సమావేశంలో ఈనెల 3న ‘పర్సంటేజీల బాగోతం’ శీర్షికన ‘సాక్షి’ పత్రికలో ప్రచురించిన కథనంపై తీవ్ర చర్చ సాగింది. అవినీతి వ్యవహారాలపై సభ్యులు అడిదల శ్యామల, సిర్రా కాంతమ్మ, బుడితి దిలీప్, బొంతు రాజశేఖర్, సఖినేటిపల్లి సురేష్, యర్రా లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని తదితరులు నిలదీశారు. బాక్స్ టెండర్లు పెట్టి తనకు కూడా తెలియికుండా బాక్స్ టెండర్లు, సీ బిల్స్ పెట్టి లక్షలు దండుకోవడం ఏమిటని చైర్‌పర్సన్ ప్రశ్నించారు. కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, బాక్స్ టెండర్ల పనులపై విచారణ చేయాలని డీఎంఏకు ఫిర్యాదు చేయాలని నిర్ణయిస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపారు.
రణరంగంలా నరసాపురం కౌన్సిల్ సమావేశం


