
రాష్ట్రపతి విశిష్ట పురస్కారానికి పెద్దిరాజు ఎంపిక
పాలకోడేరు: సీబీఐ అధికారి పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందిన బండి పెద్దిరాజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్రపతి పోలీస్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌లో ఆయన అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన తన 32 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 150 పైబడి రివార్డులు అందుకున్నారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ – ఐపీఎం, 2014, 2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు – ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్’ పొందారు. 1997లో సబ్ ఇన్‌స్పెక్టర్, 2003లో ఇన్‌స్పెక్టర్, 2016లో డిప్యూటీ ఏఎస్‌పీ, 2023లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు.
కేసుల దర్యాప్తులో కీలకపాత్ర
రామర్ హెర్బల్ ఫ్యూయల్ కేసు, పరిటాల రవి హత్య కేసు, న్యాయవాది సతీష్ హత్య అండ్ అంతర్రాష్ట్ర నారాయణన్ హత్య కేసులను మద్రాస్ హైకోర్టు ఆయనకు అప్పగించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు, బిట్స్ పిలానీ ఆన్‌లైన్ పరీక్ష కుంభకోణం, అంతర్జాతీయ ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపుల కేసు, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లను అనుకరిస్తూ అంతర్జాతీయ టెక్ సపోర్ట్ స్కామ్‌లు వంటి హై ప్రొఫైల్ కేసులను ఆయన దర్యాప్తు చేశారు. ఇటీవల ఆయన నీట్ 2024 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ ఆయన ప్రయత్నాలు 45 మంది నిందితులను అరెస్టు చేయడానికి, సమగ్ర చార్జిషీట్‌లను దాఖలు చేయడానికి ఉపయోగపడ్డాయి. బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించడంపై శృంగవృక్షం శ్రీ వాసవీ ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, గ్రామాభివృద్ధి కమిటీ హర్షం వ్యక్తం చేశాయి.