
జనం నెత్తిన గుదిబండ
ఏలూరు, (మెట్రో): ‘ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు’ అన్నట్టుంది సామాన్యుడి పరిస్థితి. ఓ పక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న సమయంలో ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడంతో మరింత అదనపు భారం పడుతుంది. దీంతో జిల్లాలోని 6,45,776 మంది గ్యాస్ వినియోగదారులపై సిలెండర్‌కు రూ.3.22 కోట్ల భారం పడనుంది. బియ్యం, కందిపప్పు, పంచదార, కూరగాయలు ఇలా ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి.
డెలివరీ చార్జీలు అదనం
జిల్లాలో 14.2 కేజీల సిలిండర్ రూ.844.50గా ఉంది. దీనికి అదనంగా డెలివరీ చార్జీలుగా దూరాన్ని బట్టి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సిలిండర్‌కు రూ.894 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రూ.900 వరకు డీలర్లు వసూలు చేస్తున్నారు. ఇక పెరిగిన ధరతో రూ.950 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వంట గ్యాస్‌పై కేవలం రూ.10 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ సొమ్ములు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నామని చెబుతున్నా పూర్తిస్థాయిలో జమవుతున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై పర్యవేక్షణ లేకపోవడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వంట నూనె లీటరు రూ.150, కిలో కందిపప్పు రూ.150, మినపప్పు రూ.110 ఇలా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
జిల్లాలో 6,45,776 కనెక్షన్లు
ప్రజలపై రూ.3.22 కోట్ల అదనపు భారం
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు
సాధారణ కనెక్షన్లు 4,06,125
దీపం కనెక్షన్లు 1,92,212
సీఎస్‌ఆర్ కనెక్షన్లు 18,243
ఉజ్వల (పాత) 3,320
ఉజ్వల (కొత్త) 24,319
గిరిజనుల కనెక్షన్లు
(5 కిలోల సిలెండర్) 1,557
మొత్తం 6,45,776