ఆటలంటే మాటలా!

Tokyo Olympics Mary Kom Loss The Game Editorial By Vardelli Murali - Sakshi

దేశ ప్రజల్లో ఆశలు పెంచిన మేటి బాక్సర్‌ మేరీకోం టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ఒట్టి చేతులతో నిష్క్రమించారు. మూడింట రెండు రౌండ్లు నెగ్గి కూడా, ఓడి ప్రీ–క్వార్టర్‌ ఫైనల్స్‌ నుంచే ఆమె వెనుదిరగడంతో దేశం నివ్వెరపోయింది. క్రీడాసక్తులైన ఔత్సాహికులు కొందరి ఉవాచ ఏమంటే... ‘కోట్ల మంది భారతీయుల ఆశల్ని మేరీ కోమ్‌ వమ్ము చేసి, నిరాశపరిచారు’అని. బహుశా కొన్ని చానళ్లూ, పత్రికలూ తమ పతాకశీర్షికల్ని ఇలా రాస్తాయేమో! కానీ, ఇక్కడో విషయం గమనించాలి. 130 కోట్ల జనాభా దేశం ఒక క్రీడాకారిణిపై అంతగా ఆశలు పెట్టుకోవడం తప్పా? బాక్సింగ్‌ వంటి క్రీడలో... ఇప్పటికే ఆరుమార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నలుగురు పిల్లల తల్లి, వారి ఆశల్ని ఇంకా... నెరవేర్చలేకపోవడం ఆమె తప్పా? ఆలోచించదగిందే! ఆటల్లో గెలుపోటములు సహజం.

ఎంత గొప్ప క్రీడాకారులైనా అన్నిమార్లూ గెలవలేరు. క్రీడలు పతకాల కోసం కాదు, క్రీడాస్ఫూర్తి కోసం! మనం ఏ మేరకు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నాం? క్రీడలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రీడా రంగాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఎంతమేర శాస్త్రీయ పంథాలో అభివృద్ధి పరు స్తున్నాం? ఇవీ మన ముందున్న ప్రశ్నలు. వీటికి సమాధానం కావాలి. ప్రతిసారి ఒలంపిక్స్‌ ముందు పెద్ద ఎత్తున ఆశలతో బృందాల్ని పంపడం, తీరా పోటీలు ముగిశాక... ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదని నిరాశపడటం.

ఇది మనకు రివాజయింది! వాస్తవిక పరిస్థితుల్ని అంగీకరించే ఆత్మపరిశీలన ఎప్పుడూ జరుగదు. నేల చదును పరుచకుండా, యోగ్యమైన విత్తనాలు చల్లకుండా, శ్రద్ధాసక్తులతో సాగు చేయకుండా పంట దిగుబడి ఆశించినట్టు ఉంటుంది క్రీడల్లో మన వ్యవహారం. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థల ప్రోత్సాహంతో ఈసారి కొంత ఆశాజనకం అనిపించినా.... ప్రతికూలాంశాలు ఇప్పుడే తలెత్తాయి. కోవిడ్‌వల్ల తగినంత శిక్షణ లభించక, స్పర్ధకు అవకాశంలేక, క్రీడాకారుల్లో మానసిక దృఢత్వం కొరవడి ప్రతిభ పూర్తిస్థాయి రాణించని స్థితి నెలకొంది.

లండన్‌ 2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు నెగ్గిన భారత్, ఇనుమడించిన ఉత్సాహం, గంపెడా శలతో వెళ్లి రియో 2016 ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సరిపెట్టుకుంది. ఈ ‘ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి’ పరిస్థితి క్రీడల్లో మనకు మొదట్నించీ ఉంది! కిందిస్థాయి నుంచి క్రీడా నైపుణ్యాల వృద్ధి, ఆరోగ్యకరమైన స్పర్ధ వాతావరణం, అంతర్జాతీయ పోటీని తట్టుకునే సన్నద్ధత లేమి ఇందుకు కారణం. వ్యక్తిగతంగా అసాధారణ ప్రతిభ చూపి, ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికల్లో పతకాలు నెగ్గిన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలివ్వడం, ఇతరుల్లో స్ఫూర్తి నింపడం మెచ్చతగిందే! కానీ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నగదుగా, కోట్లాది రూపాయలు విలువచేసే భూముల్ని అకాడమీల పేరిట అప్పగించడం సముచితమా? దానికి బదులు క్రీడలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించి, నిధులిచ్చి మౌలిక సదుపాయాలు పెంచాలి. ఆటల్లో అగ్రభాగాన ఉండే ఎన్నో దేశాల్లో ఇలా వ్యక్తిగత నగదు బహుమతులుండవు.

మనం కూడా క్రీడా ప్రాంగణాలు, క్రీడా హాస్టళ్లు, క్రీడా సామగ్రితోనూ గట్టి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్బంధ క్రీడా విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించాలి. విద్యా, ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తగు నిష్పత్తిలో రిజర్వేషన్‌ కల్పించాలి. దేశంలో క్రికెట్‌ కున్న ప్రజాదరణతో ఇతర మొత్తం క్రీడలకున్న ప్రాధాన్యత కూడా సరితూగదు. అన్ని క్రీడాంశాల్లో తగిన వసతులు, వనరులు, స్పర్ధ, ప్రోత్సాహకాల్ని పెంచాలి. మొక్కగా ఉన్నపుడు చేస్తేనే క్రీడల్లో నైపుణ్యం పెరుగుతుంది.

అంతర్జాతీయ ప్రమాణాలను మనవాళ్లు అందుకోగలుగుతారు. ఈసారి 117 మంది క్రీడాకారులతో, 228 మంది అతి పెద్ద బృందం టోక్యో వెళ్లింది. షూటింగ్, విలువిద్య, కుస్తీలు, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి అంశాల్లో గంపెడాశలతోనే వెళ్లి ప్రతిభను పరీక్షించుకుంటున్నారు. రియో ఒలింపిక్స్‌ తర్వాత... ప్రత్యేక శ్రద్ధతో ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీం’(టాప్స్‌), ‘ఖేలో ఇండియా’ వంటివి పెట్టి కేంద్ర ప్రభుత్వం, ‘జేఎస్‌డబ్ల్యూ’తో జిందాల్, ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌... ఇలా ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలు కూడా మంచి ప్రోత్సాహ మిచ్చాయి. ఆశలు పెరిగాయి. ఫలితాలే ఆశించినట్టు లేవు! 68,000 జనాభా కలిగిన చిన్న దేశం బెర్మడా, ఫిజీ వంటివి కూడా బంగారు పతకాలతో జాబితాకెక్కాయి.

తొలిరోజు మీరాబాయి అందించిన రజతమే భారత్‌ను జాబితాలో నిలిపింది. తర్వాత ఇంకేమీ రాలే! మన క్రీడాకారులపై ఒత్తిడి కూడా ప్రతికూలంగా పనిచేస్తోంది. లండన్‌ ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నరంగ్‌ (షూటింగ్‌) అన్నట్టుగా ఆటను ఆస్వాదించడం, పోటీని తట్టుకోవడమే కాదు విమర్శల్ని ఎదుర్కోవడంలోనూ యువ ఆటగాళ్లు రాటు తేలాలి. ఒలింపిక్‌ వేదికల్లో కెమెరాలు, ఆటగాళ్ల గుండె కొట్టుకునే పల్స్‌రేట్‌ను కొలుస్తున్నపుడు, మనవాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతున్నట్టు నమోదవుతోంది.

వాటిని అధిగమిస్తేనే అసలైన క్రీడాస్ఫూర్తి! క్రీడల్ని ప్రోత్సహించడంలో హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల సరసన మిగతా రాష్ట్రాలూ చేరాలి. ఈశాన్యభారత్‌లోని చిన్న రాష్ట్రమే అయినా మణిపూర్‌ క్రీడలకు పెట్టింది పేరు. ‘మణిపూర్‌లో గుడ్డిగా రాయి విసిరితే, అది ఓ క్రీడాకారునికి తగులుతుంద’ని నానుడి. గ్రామీణ స్థాయి నుంచి అంత పకడ్బందీగా ఆటలు ఆడుతారు కనుకే ప్రస్తుత ఒలింపిక్‌ జట్టులో మణిపురీలు ఐదుగురున్నారు. ఇప్పటికి మనకు లభించిన ఒకే ఒక పతకం ఆ రాష్ట్ర చలువే! ఆ స్ఫూర్తే దేశవ్యాప్తమవ్వాలి! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top