ఈ తెలుగు మాట్లాడుతున్నామా? | Sakshi
Sakshi News home page

ఈ తెలుగు మాట్లాడుతున్నామా?

Published Mon, Aug 29 2022 12:58 AM

Telugu Language Importance On Gidugu Ramamurthy Jayanthi - Sakshi

అమ్మకు జ్వరంగా ఉంటుంది. స్కూల్లో అన్నం గంట కొట్టినప్పుడు ఇంటికెళితే బువ్వ ఉండదని ముందే తెలుసు. ఆ సంగతి ఎవరికీ చెప్పక నీళ్ల కుళాయి వైపు నడుస్తూ రెండు గుక్కలే ఈ పూటకు అనుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు కనిపెట్టి– ‘రారా. నా టిపినీలో తిందువు’ అని పిలుస్తాడు. భలేవాడు వాడు. పక్క పాపిట దువ్వుకుని, స్లిప్పర్లు టపాటపాకొట్టి నడుస్తూ, ఊరికూరికే నవ్వుతూ, మన స్నేహాన్ని ఇష్టపడుతూ. ఆ పూట వాడి ముద్దల్లో మనకు వాటా. పొరుగూరిలోనే ఉంటాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడని విని ఉంటాము. కలిసి చాలా ఏళ్లయివుంటుంది. ‘ఏరా... ఎలాగున్నావు’ అని ఫోన్‌  చేసి అడగడం మంచి తెలుగు వాక్యం. తియ్యటి తెలుగు వాక్యం. పలుకుతున్నామా?

ఆ పిల్ల తూనీగే. పక్కింట్లో ఉంటుంది. అక్కా అని పిలిస్తే తప్ప పలకదు. ఆదివారం వస్తే ‘రావే అమ్మాయ్‌’ అని గోరింటాకు పెట్టేది. ఇంట్లో పూసే రోజాపువ్వు బడికి వెళుతున్నప్పుడు జడలో గుచ్చేది. సినిమా పత్రికలో ఉన్న హీరోయిన్‌  ఫొటో చూపించి ‘ఈ డ్రస్సు నీకు భలే ఉంటుంది’ అని చెప్పేది. ‘భయంగా ఉందక్కా’ అనంటే, ‘తొక్కు’ అని సైకిల్‌ నేర్పించింది. టీచరట. రిటైరైందట. అమెరికాలో పిల్లల దగ్గర ఉందట. వాట్సప్‌ కాల్‌ చేసి ‘అకా... నీ గుర్తుగా ఇంట్లో ఎర్రగులాబీ వేశా. చూడ్డానికి ఎప్పుడొస్తావు?’ అని అడగడం అలాంటిలాంటి తెలుగు కాదు. తేనె తెలుగు.

మేనమామ ఒకడు ఆ రోజుల్లో  హిప్పీ క్రాఫుతో ఇంటికొచ్చేవాడు. ‘సినిమాకెళ్దాం పదండి’ అని తీసుకెళ్లేవాడు. టక్‌ చేసి కాలేజీకెళితే హీరోలా చూస్తారట. ‘మావయ్యా’ అని పిలిస్తే చాలు హాజరయిపోయేవాడు. ఒకసారి నాన్నతో ఎవరో గొడవపడితే ‘ఖబడ్దార్‌’ అని చూపుడువేలు ఆడించి వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆర్థికంగా కూడా బాగలేడు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. మనమేం శ్రీమంతులం కాము. కాని వెళ్లి, దగ్గర కూచుని, చేయి పట్టుకుని ‘మావయ్యా.... సాహసవంతుడు సినిమా చూపించిన సాహసవంతుడివి నువ్వు. ఏం కాదు. లేచి తిరుగుతావు. నీకేం కావాలో నేను చూస్తాను. అందాక ఇది ఉంచు. కాదంటే నామీదొట్టే’ అని పలికే తెలుగు ఉంది చూశారూ... దేవతలు ఆశీర్వదించే తెలుగు అది.

అవునండీ... ఆఫీసులో కొలీగే. కలిసి క్యాంటీన్‌కు వెళ్లేవారు. కలిసి భోజనానికి వెళ్లేవారు. కలిసి పని పంచుకుని చేసవతల పడేసేవారు. ఏదో మాటా మాటా అనుకున్నారు. మాట్లాడ్డం మానుకున్నారు. కాని ఎన్నాళ్లు? రోజూ కనపడాలే. పక్కనే ఉండాలే. ముఖం చూడాలే. ఇక చూసి చూసి ఎవరో ఒకరు డెస్క్‌ దగ్గరికెళ్లి ‘క్షమించు గురూ. ఏదో పొరపాటైంది. ఇంతకు ముందులానే ఉందాం. నీతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది నాకు’ అన్నామనుకోండి... ఆ తెలుగు అతి సువాసనతో నిండిన తెలుగు.
‘అమ్మా... ఫోన్లు మాట్లాడేటట్టయితే స్పీకర్‌ పెట్టుకు మాట్లాడు. చెవికి ఇబ్బంది ఉండదు. అస్తమానం టీవీ చూడకు. మొన్నామధ్య నువ్వు చేసే పూర్ణాలు గుర్తుకొచ్చాయిగానీ అంత రుచితో ఇక్కడ ఎవరు చేయగలరనీ’. ‘నాన్నా... నా కోసమని కొత్తచొక్కా కొన్నాను. కాని బ్లూ కలర్‌ మీకే బాగుంటుందనిపించింది. పంపుతున్నా. వేసుకోండి’. ‘ఓ నా బంగారు చెల్లీ... ఈ అన్న పెళ్లయ్యాక మారిపోయాడని అనకు. చిన్నప్పుడు పార్కులో ఉయ్యాలూగుతూ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడూ అంతే, పక్కనే ఉంటాను’. ‘పెద్దొదినా... మీరిద్దరూ పిల్లలతో భోజనానికి ఎందుకు రారు మా ఇంటికి. పట్టింపులు పెట్టుకోకండి దయచేసి’... ‘ఏమే మూగమొద్దు. క్లాస్‌మేట్లందరం టూర్‌కెళ్దామంటే ఏ సంగతీ చెప్పవేమే’...

ఎంతమంచి తెలుగు వాక్యాలో చూడండి ఇవి. పలకడం మరిచిపోతున్న వాక్యాలు. పలకక్కర లేదనుకుంటున్న వాక్యాలు. వ్యవహారంలో నుంచి తొలగిపోతున్న వాక్యాలు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాక్యాలు. బంధం గట్టిగా ఉంటే బలగం గట్టిగా ఉంటుంది. బంధం పట్ల ఆపేక్ష ఉంటే నిలబెట్టుకోవాలన్న తలంపు ఉంటుంది. ‘అ’ ఒక్కటే లేదు. ‘ఆ’ పక్కనే ఉంది. ‘అచ్చులు’ మాత్రమే లేవు. ‘హల్లుల’ను తోడు చేసుకున్నాయి. 

ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతి. వ్యవహారిక భాష కోసం ఆయన జీవితాన్ని ధారబోశాడు. ప్రతి తెలుగువాణ్ణి తెలుగు కోసం గుప్పెడు ఊపిరి ఇమ్మన్నాడు. కాని జీవన వ్యవహారాల పట్ల ఉండే అక్కరను బట్టే భాష పట్ల అక్కర కూడా ఉంటుంది. మన బంధాలతో ఎలా ఉన్నామో భాషతో కూడా అలాగే ఉంటాము. జన్మ సంబంధాలు, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సాటి వర్గ కుల మత సంబంధాలు... వీటికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తామో భాష పట్ల కూడా అంతే గౌరవం ఇస్తాము. ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉండదు. అన్నీ ఒక తానులో బట్టలే.

ఇల్లంటే డోర్‌ కర్టెన్, బెడ్‌రూమ్, టాయిలెట్‌ అని మాత్రమే కాక ‘పుస్తకాల అర’ కూడా అనుకోనంత వరకు, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అని కాక అనేక అనుబంధాలు కూడా అని తలవనంత వరకు, బంధాలతో ఆత్మీయత భాషతో పాశంలోనే జీవన మాధుర్యం ఉంది అని ఇవి రెండూ ఎంతకూ చెల్లించలేని, ఎగవేతకు కుదరని రుణాలని చిత్తంతో నమ్మనంత వరకూ తెలుగువారి జీవితం, తెలుగుతో నిండిన జీవితం సంపూర్ణం అనిపించుకోదు. ఎవరైనా స్నేహితునికి ఫో¯Œ  చేసి ‘మంచి తెలుగు పుస్తకం ఏదైనా కొనుక్కు వద్దామా’ అనండి. ఇవాళ్టికివాళ అంతకు మించిన పుణ్యప్రదమైన తెలుగు మరొకటి లేదు. అనుబంధాల తెలుగు వెలుగు గాక! 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement