పులుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌! | Sakshi
Sakshi News home page

పులుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌!

Published Wed, Apr 12 2023 2:30 AM

Sakshi editorial On Tigers progress report

జీవవైవిధ్యాన్ని పరిరక్షించటంలో, పర్యావరణాన్ని కాపాడటంలో, ప్రకృతి సమతుల్యత కొనసాగటంలో పులుల ప్రాధాన్యం తెలిసినవారికి దేశంలో పులుల సంఖ్య పెరిగిందన్న వార్త ఉపశమనం ఇస్తుంది. ప్రధాని ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,167 పులులున్నాయి. అయిదేళ్లక్రితం 2,226గా ఉన్న సంఖ్య ఇంతగా పెరిగిందంటే పులుల సంరక్షణకు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలే కారణమనడంలో సందేహం లేదు.

ఒక్క పులులన్న మాటేమిటి... వన్యమృగాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల వల్ల సింహాలు, చిరుతపులుల సంఖ్య కూడా గణనీయంగా హెచ్చింది. ఆసియా జాతి సింహాల సంఖ్య 523 నుంచి 674కు, చిరుతల పులుల సంఖ్య దాదాపు 8,000 నుంచి 12,852కు పెరిగాయి. పులుల సంఖ్య పెంచటంతోపాటు దేశంలో కనుమరుగైన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పించి ఇక్కడి అడవుల్లో వదిలిపెట్టారు.

ప్రపంచంలో ఉన్న పులుల్లో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయంటే అది ప్రాజెక్టు టైగర్‌ పథకం చలవే. సరిగ్గా యాభైయ్యేళ్ల క్రితం భారత్‌లో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో డాక్టర్‌ కరణ్‌సింగ్‌ నేతృత్వంలో పద్మజానాయుడు, కైలాస్‌ సంకాల వంటివారితో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు.

తర్వాతే ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద పులుల తొలి సంరక్షణ కేంద్రం జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ మొదలైంది. పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 55కు చేరుకుంది. ప్రాజెక్టు టైగర్‌ ప్రారంభించేనాటికి పులులు, సింహాల వేట సంపన్నవర్గాలకు వినోదంగా ఉండేది. వారిని అడవుల జోలికి రాకుండా చేయటానికి కఠిన చర్యలు తీసుకోవటం ప్రారంభించాక క్రమేపీ ఆ ధోరణి తగ్గింది. 

అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవటం వల్ల వన్యప్రాణుల్లోని ఎన్నో జాతులకు ప్రాణం మీదికొస్తోంది. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 27 రకాల జాతులు అంతరిస్తున్నాయి. పులుల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నా దేశంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి.

ప్రపంచంలోనే జీవ వైవిధ్యతకు పెట్టింది పేరైన పడమటి కనుమల ప్రాంతంలో పులుల సంఖ్య తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. 1,600 కిలోమీటర్ల పొడవునా 1,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో పడమటి కనుమలు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.

ఈ రాష్ట్రాల్లో పులుల సంరక్షణ కేంద్రాలు 12 ఉండగా, ఇతరేతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 68 వరకూ ఉన్నాయి. అయితే అయిదేళ్లక్రితం ఈ ప్రాంతంలో 981గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు 824 మాత్రమే. పడమటి కనుమలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి చాన్నాళ్లయింది.

అక్కడి మూడోవంతు ప్రాంతం జీవావరణపరంగా సున్నితమైనదని 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది కూడా. కానీ తదుపరి చర్యలు అందుకు తగ్గట్టుగా లేవు. ఇలా ప్రకటించటాన్ని కర్ణాటక, కేరళ, గోవా తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత తీరిందన్నట్టు చేతులు దులుపుకొంది. ఫలితంగా అడవులు తరిగి, పర్యావరణం దెబ్బతిని, వన్య ప్రాణులకు ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దాని పర్యవసానంగానే దేశమంతా పులుల సంఖ్య పెరిగితే అక్కడ తగ్గింది. దీన్ని తగ్గటంగా పరిగణించనవసరం లేదు...పులుల సంఖ్య స్థిరంగా ఉండిపోయినట్టు భావించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవారు లేకపోలేదు. కానీ అడవులు అంతరిస్తూ వాటి స్థానంలో రోడ్లు విస్తరిస్తుంటే...పర్యాటకం పేరిట మనుషుల తాకిడి పెరుగుతుంటే, ఖనిజాల కోసం అడవులు నరకడానికి పూనుకుంటే వన్యప్రాణులు ప్రశాంతంగా మనుగడ సాగించలేవు.

పులులు, అవి వేటాడే జంతువులు సంచరించే ప్రాంతాలు కుంచించుకుపోతే పులులపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. వేట కోసం వెదుక్కుంటూ జనావాసాలపై కూడా పడతాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అడవుల వినాశనానికి కారణమవుతున్న ప్రభు త్వాలు ఆ తర్వాత జరిగే పర్యవసానాలు ఎదుర్కొనటానికి మరిన్ని అవకతవకలకు పాల్పడుతున్నాయి.

ఏనుగులు, పులులు, చిరుతల బారినపడి గత పదినెలల్లో 41మంది పౌరులు మరణించారని మొన్న ఫిబ్రవరిలో కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. స్వేచ్ఛగా సంచరించటానికి, ఆహారం వెదుక్కొనటానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు పులుల్లో ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడి వాటి పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుందని నాలుగేళ్లక్రితం సీసీఎంబీ నివేదిక హెచ్చరించింది.

వన్యమృగాల సంరక్షణ పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేద్దామని ప్రయత్నించే ప్రభు త్వాలు తీరా ఆ అడవులను ఖనిజాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి, విశాల మైన రోడ్లు నిర్మించటానికి వెనకాడటం లేదు. దాంతో భారీ యంత్రాలు అక్కడికి తరలివస్తున్నాయి. వన్యప్రాణులను హడలెత్తిస్తున్నాయి. నిజానికి శతాబ్దాలుగా ఆదివాసీలు వన్యప్రాణులతో సురక్షితంగా సహజీవనం సాగిస్తున్నారు.

వాటి కదలికలకు అనువుగా జీవనం సాగించటం, వాటికి హాని కలగనిరీతిలో అవసరమైన ఆత్మరక్షణ చర్యలు తీసుకోవటం పరంపరాగతంగా వారికి అలవడిన విద్య. ఏదేమైనా అడవుల సంరక్షణకూ, వన్యమృగాలను కాపాడటానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోనట్టయితే జీవవైవిధ్యం నాశనమవుతుంది. మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు వెలువడిన నివేదికలోని గణాంకాలు ఆశావహంగానే ఉన్నా చేయాల్సింది ఇంకెంతో ఉన్నదని నివేదిక తెలియజేస్తోంది. ఆ దిశగా అడుగులేయటమే ప్రభుత్వాల కర్తవ్యం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement