గైర్హాజరీ సందేశం! | Sakshi
Sakshi News home page

గైర్హాజరీ సందేశం!

Published Tue, Sep 5 2023 12:18 AM

Sakshi Editorial On G20 Summit China Xi Jinping

అనుకున్నదే అయింది. రానున్న ‘జీ20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అసాధారణ రీతిలో హాజరు కాకపోవచ్చంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. చైనా ప్రధాని లీ కియాంగ్‌ ఆ సదస్సుకు హాజరవుతారంటూ ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధానులిద్దరూ ఏకకాలంలో విదేశాల్లో ఉండడం, అందులోనూ ఒకే కార్యక్రమంలో ఉండడమనేది చైనా ఎన్నడూ చేయని పని గనక ‘జీ20’కి షీ గైర్హాజరు ఖాయమని తేటతెల్లమైంది.

వెరసి, ‘జీ–20’ అధ్యక్ష హోదాలో భారత్‌ ఈ నెల 9, 10 తేదీల్లో ఆతిథ్యమిస్తున్న 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇప్పుడు కొత్త కారణంతో వార్తల్లో నిలిచింది. ఇంట ఆర్థికవ్యవస్థలో ఇక్కట్లు, బయట అమెరికా – భారత్‌లతో క్షీణసంబంధాలు, పొరుగుదేశాలతో కొనితెచ్చుకున్న తగాదాల మధ్య చైనా అధినేత కావాలనే మొహం చాటేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఆహ్వానించినప్పుడు వెళ్ళడానికి కొన్ని కారణాలుంటే, వెళ్ళాల్సి ఉన్నా వెళ్ళకపోవడానికి అంతకు మించే కారణాలుంటాయి. చైనా అధినేత గైర్హాజరు కథా అంతే! భారత్‌తో చైనా ద్వైపాక్షిక సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. లద్దాఖ్‌లో మూడేళ్ళ క్రితం సైనికుల కొట్లాట నుంచి ఇదే ధోరణి. సరిహద్దుకు ఇరువైపులా మోహరించిన సైన్యం ఉద్రిక్తతలకు అద్దంపడుతోంది. వాణిజ్యంపై విభేదాలు ఉండనే ఉన్నాయి.

బద్ధశత్రువైన అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను భారత్‌ పెంచు కోవడంతో డ్రాగన్‌కి పుండు మీద కారం రాసినట్టుంది. చైనాను వెనక్కినెట్టి అత్యధిక ప్రపంచ జనాభా గల దేశంగా భారత్‌ ఇప్పటికే ముందుకొచ్చింది. సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష శోధన, ప్రపంచ వాణిజ్యంలో పోటాపోటీ సరేసరి. ఇవి చాలదన్నట్టు ప్రామాణిక దేశపటమంటూ భారత భూభాగాల్ని కలిపేసుకున్న వక్రీకరించిన మ్యాప్‌ను చైనా తాజాగా విడుదల చేసి కొత్త రచ్చ రేపింది. 

చైనా అధినేత మొహం చాటేయడానికి ఇలా చాలా కారణాలే! ఈ తాజా పరిణామం చైనా – భారత సంబంధాల మెరుగుదలకు తోడ్పడదు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో షీ సంభాషించే అవకాశం తప్పిపోతోంది. నిజానికి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సహా పలువురు ఈ మధ్య బీజింగ్‌కు సందర్శనలు జరిపారు. అయినప్పటికీ అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత క్షీణించి ఉన్నాయి.

గత నవంబర్‌లో ఇండొ నేషియాలోని బాలిలో జరిగిన గత ‘జీ20’ తర్వాత షీ, బైడెన్‌లు కలసి మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళీ కలసి, సంబంధాలను సరిదిద్దుకొనే అవకాశాన్ని చైనా చేతులారా జారవిడుస్తోంది. బైడెన్‌ సైతం ఈ పరిణామంతో నిరాశకు లోనయ్యాననడం గమనార్హం. షీ ఒక్క ‘జీ20’నే కాదు, జకార్తాలో జరగనున్న ఏషియాన్‌ (వాయవ్య ఆసియా దేశాల సంఘం), ఈస్ట్‌ ఏషియా సదస్సులూ ఎగ్గొడుతున్నారు. వాటికీ చైనా ప్రధానే హాజరు కానున్నారు.

2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు భౌతికంగానూ, ఒకసారి వర్చ్యువల్‌గానూ (సౌదీ అరేబియా– 2020) జీ20 సదస్సులు జరిగాయి. వాటిలో మొదటి మూడు మినహా 2010 నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర సదస్సులోనూ అన్ని దేశాల అధినేతలూ పాల్గొన్న దాఖలా లేదు. అయితే, చైనా అధినేత మాత్రం ఏ జీ20 సదస్సుకూ ఇప్పటి దాకా గైర్హాజరవలేదు. కరోనా ఆంక్షలున్న రెండేళ్ళూ వర్చ్యువల్‌గానైనా హాజరయ్యారు.

గత నెల దక్షిణాఫ్రికాలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల బృందమైన ‘బ్రిక్స్‌’ సదస్సు జరిగినప్పుడూ షీ వచ్చారు. మరి, ఇప్పుడు మాత్రం తన బదులు ప్రధానిని పంపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన బదులు విదేశాంగ మంత్రినిపంపుతున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. అధ్యక్షుడి గైర్హాజరుకు కారణాలు చైనా బయటకు చెప్పక పోయినా, ఇదంతా సహజమేనన్నట్టు భారత అధికార వర్గాలు చిత్రిస్తున్నా... విషయం మాత్రం అసాధారణమే. షీ రాజనీతి పట్ల సందేహాలు రేపుతున్నాయి.

మావో తర్వాత మరే ఇతర చైనా నేతకూ లేనంతటి అధికారం షీ సొంతం. ప్రాదేశిక ప్రయో జనాల పేరు చెప్పి, తైవాన్, దక్షిణ చైనా సముద్రం సహా అన్నీ చైనావేనంటూ ఆయన అంతకంతకూ దూకుడు చూపుతున్నారు. సహజంగానే పాకిస్తాన్‌ లాంటి ఒకట్రెండు దేశాల్ని మినహాయిస్తే, పొరుగున మిత్రుల కన్నా ఎక్కువగా శత్రువుల్ని చేసుకున్నారు.

నిజానికి, జీ20 దేశాలంటే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం. ఇంత కీలకమైనా సరే, దీని కన్నా తమ చైనా ఆధిపత్యం ఉన్న ‘బ్రిక్స్‌’ వగైరాల వైపే షీ మొగ్గుతున్నారనుకోవచ్చు. ఇటీవల ఆయన ప్రయాణించినదల్లా సౌదీ అరేబియా, రష్యా, సౌతాఫ్రికా లాంటి స్నేహపూర్వక స్వాగతం లభించే దేశాలకే అని విశ్లేషించవచ్చు. అటు అమెరికా, ఇటు భారత్‌లతో ఉద్రిక్తతలు తగ్గించడమూ తన షరతుల ప్రకారమే జరగాలని చూస్తున్నారనుకోవచ్చు. 

డ్రాగన్‌ బుసలు కొడుతున్నందునే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన భద్రతా కూటమి ‘క్వాడ్‌’లో భారత్‌ చేరిందని గమనించాలి. ఇక, బైడెన్‌తో ఇప్పుడు భేటీ తప్పిందంటే మళ్ళీ నవంబర్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సు దాకా వారు కలిసే ఛాన్స్‌ లేదు. ప్రస్తుత చైనా వైఖరి చూస్తుంటే, అప్పుడైనా షీ హాజరవుతారన్న గ్యారెంటీ లేదు.

జీ20లోనూ దేశాధి నేతలు చేయాల్సిన సమష్టి ప్రకటనకు గండికొట్టి, భారత పాలకుల విశ్వగురు ప్రచారాన్ని దెబ్బ తీశారనుకోవచ్చు. ప్రధానిని పంపుతున్నా, సదస్సులోని నిర్ణయాలకు చైనా కట్టుబడేలా చూసేందుకు సదరు వ్యక్తికి ఏపాటి అధికారం ఉంటుందో చెప్పలేం. వెరసి, షీ గైర్హాజరీ సందేశం సుదీర్ఘమైనదే! 

Advertisement
Advertisement