చైనా మెచ్చని తైవాన్‌ తీర్పు  | Sakshi
Sakshi News home page

చైనా మెచ్చని తైవాన్‌ తీర్పు 

Published Fri, Jan 19 2024 12:09 AM

Sakshi Editorial On China did not appreciate Taiwan verdict

కొన్ని ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో అమితంగా ఉంటుంది. జనవరి 13న తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలాంటివే. ఈ ఎన్నికల్లో అక్కడి ‘ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ’ (డీపీపీ) వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడం అనేక విధాల ప్రత్యేకమైనది. ద్వీపదేశమైన తైవాన్‌పై ఆధిపత్యం కోసం చైనా జోరుగా ప్రయత్నిస్తున్న వేళ, ఇండో– పసిఫిక్‌ ప్రాంతంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నవేళ వచ్చిన ఎన్నికల ఫలితాలు ఇక్కడి భౌగోళిక రాజకీయాల్లో కీలకమైనవి. 1.4 కోట్ల తైవానీయులు స్వయంప్రతిపత్తి గల ప్రజాస్వామ్యంగానే దేశం కొనసాగా లనీ, చైనాతో బంధంలో మార్పు అవసరం లేదనీ భావిస్తున్నట్టు ఫలితాలను వ్యాఖ్యానించవచ్చు.  

ఉపాధ్యక్షుడైన విలియమ్‌ లై చింగ్‌–తె తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డీపీపీ తరఫున పోటీపడి, చైనాతో సర్దుబాటు కోరుతున్న ప్రధాన ప్రతిపక్షమైన కెఎంటి (కుయో మిన్‌ తాంగ్‌) అభ్యర్థిపై గెలిచారు. అయితే, మునుపటి 2020 ఎన్నికల్లో అప్పటి డీపీపీ అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధిస్తే, ఈసారి అది 40 శాతానికి తగ్గింది. డీపీపీ పార్లమెంటరీ ఆధిక్యాన్ని కోల్పోయి, అతిపెద్ద పార్టీ కిరీటాన్ని ప్రతిపక్ష కెఎంటి పాల్జేయడం గమనార్హం.

కొత్త విధానసభలో డీపీపీ 51, కెఎంటి 52 స్థానాలు గెలిచాయి. ఈ రెండు పార్టీల ద్విధాధిపత్యానికి గండికొడుతూ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన ‘తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ’ (టీపీపీ) 20 శాతానికి పైగా ఓట్లతో, 8 స్థానాలు గెలిచింది. దేశీయ విధానంలో, చైనాతో వ్యవహారంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందే. సభలో పట్టుకై ఇతర పార్టీలతో దోస్తీ కట్టాల్సి ఉంది. అలాగే, చైనా దూకుడు చూపుతున్నందున సైన్యాధిపతి అయిన తైవాన్‌ అధ్యక్షుడు ఇటు చైనా, అటు అమెరికాలతో నేర్పుగా వ్యవహరించాలి. 

నిజానికి స్వయంపాలక ప్రజాస్వామ్య దేశమైన తైవాన్‌ ఎన్నడూ కమ్యూనిస్టు చైనా నియంత్రణలో లేదు. అయితే, తైవాన్‌ ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా, ఆ దేశంపై తమదే ఆధిపత్య మంటూ డ్రాగన్‌ అహంకారం చూపుతోంది. ఎన్నికలను వ్యూహాత్మకంగా చక్కటి అవకాశంగా భావించిన బీజింగ్‌ ఫలితాలను ప్రభావితం చేసేందుకు శతవిధాల ప్రయత్నించింది. ఆర్థిక నిర్బంధాల మొదలు అసత్య ప్రచారారాలు, భద్రతా సవాళ్ళ దాకా అనేక అస్త్రాలు ప్రయోగించింది. తైవాన్‌ను కలిపేసుకోవాలని చైనా అసహనంతో తొందరపడుతుంటే, ‘ఒకే దేశం – రెండు వ్యవస్థల’ విధానం హాంగ్‌కాంగ్‌లో విఫలమవడం చూసిన తైవాన్‌ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తోంది.

చరిత్ర చూస్తే 1895 నుంచి 1945 దాకా 50 ఏళ్ళు జపాన్‌ ఏలుబడిలో తైవాన్‌ ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందింది. తీరా 1945 ఆగస్ట్‌లో జపాన్‌ లొంగిపోవడంతో, తైవాన్‌ అప్పటి చైనా ప్రధాన భూభాగాన్ని ఏలుతున్న కెఎంటి పార్టీ హయాంలోకి వచ్చింది. అప్పట్లో తైవాన్‌లోని జపనీస్‌ ఆస్తులను కెఎంటి సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో, స్థానిక తైవానీయుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తైవాన్‌ జాతీయవాదుల ఉద్యమంగా మారిన ఆ నిరసనను 1947 ఫిబ్రవరి 28న కెఎంటి అణిచివేసింది. కెఎంటి సైన్యం 28 వేల మందిని పొట్టనబెట్టుకుంది.

చియాంగ్‌ కై–షెక్‌ సారథ్యంలోని కెఎంటి జాతీయవాదులు 1949లో అంతర్యుద్ధంలో ఓటమి పాలై, తైవాన్‌కు తరలిపోయారు. అలా దాదాపు 20 లక్షల మంది కెఎంటితో కలసి చైనా నుంచి తైవాన్‌కు వలస వచ్చారు. ఇవాళ్టికీ 2.4 కోట్ల తైవాన్‌ జనాభాలో నాలుగోవంతు మంది ఈ ‘మెయిన్‌ల్యాండర్లే’. అంటే, చైనా భూభాగం నుంచి వలసదారులు, వారి సంతతే. కెఎంటి నియంతృత్వ పాలనలోనూ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టి పెట్టిన తైవాన్‌ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. 1975 వరకు అధ్యక్ష పాలనలోనే ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’గా నడిచింది. తరువాతి పరిణామాల్లో రాజకీయ సరళీకరణ ఆరంభమైంది. 

1991 నాటికి ప్రజాస్వామ్య ప్రక్రియ ఊపందుకుంది. ఉపాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిన లీ తెంగ్‌–హుయి దేశాన్ని పూర్తి ప్రజాస్వామ్య దిశగా నడిపించడానికి ఉద్యుక్తుడయ్యేసరికి డ్రాగన్‌ తోక తొక్కినట్టయింది. 1996లో తొలిసారి స్వేచ్ఛాయుత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా తైవాన్‌ జల సంధిలో చైనా వందలాది క్షిపణులు ప్రయోగించింది. తైవాన్‌కు మద్దతుగా అమెరికా యుద్ధనౌకలను పంపాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో లీ అపూర్వ విజయం అందుకున్నారు.

కాలక్రమంలో స్థానిక తైవానీ యుల ప్రయోజనాలకు కట్టుబడ్డ డీపీపీ వేగంగా జనాదరణ పొందింది. లీ పదవీ విరమణ తర్వాత 2000లో డీపీపీ అభ్యర్థే అధ్యక్షుడిగా గెలిచారు. గమనిస్తే, తైవాన్‌లో ప్రజాస్వామ్యం ఏర్పాటు నుంచి ఇప్పటి దాకా 2008, 2012లోనే కెఎంటి ‘మెయిన్‌ల్యాండర్‌’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కెఎంటి అభ్యర్థి సహా అధ్యక్ష పదవికి పోటీపడ్డ ముగ్గురూ మెయిన్‌ ల్యాండర్లు కాకపోవడం గమనార్హం. ఒకరకంగా ఇది అధికార డీపీపీ తైవానీ అస్తిత్వ రాజకీయాలకు రాజముద్ర.  

ఆసియా భౌగోళిక రాజకీయ చిత్రపటంలో తైవాన్‌ కీలకం. ప్రపంచ సాంకేతిక నాయకత్వ భవితవ్యంలోనూ ఆ దేశం అవిస్మరణీయం. ప్రపంచ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో 60 శాతం పైగా, అత్యాధునిక చిప్‌లలో 90 శాతం పైగా అక్కడ చేసేవే. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల నుంచి కార్లు, ఉపగ్రహాల దాకా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలన్నిటికీ అవే ప్రాణాధారం. స్వయంప్రతిపత్తి గల తైవాన్‌ మనకు సహజ మిత్రదేశం. అలా తాజా ఎన్నికల ఫలితాలు సానుకూల పరిణామమే.

గత 8 ఏళ్ళ లానే వచ్చే నాలుగేళ్ళూ ఢిల్లీతో బంధానికే తాయ్‌పే ఆసక్తి చూపుతుంది. దౌత్య సంబంధాలు లేకున్నా ఇప్పటికే 250కి పైగా తైవానీ కంపెనీలు భారత్‌లో 400 కోట్ల డాలర్ల మేర పెట్టు బడులు పెట్టాయి. అందుకే, తైవాన్‌ జలసంధిలో సుస్థిరత, ప్రశాంతత కొనసాగితే భారత్‌కు అది శుభవార్త. తరచూ సైనిక విన్యాసాలతో అస్థిరత రేపుతున్న చైనా సైతం తైవాన్‌ ప్రజాభీష్టాన్ని గౌరవిస్తే మేలు. 

Advertisement
 
Advertisement
 
Advertisement